కలం వెబ్ డెస్క్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. చావు నోట్లో తలబెట్టి ‘కేసీఆర్ సచ్చుడో-తెలంగాణ వచ్చుడో’ అనే మొక్కవోని సంకల్పంతో తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. తెలంగాణను పదేళ్ల తన పాలనతో ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడన్నారు.
‘‘రాష్ట్రాన్ని చంటి బిడ్డలా చూసుకుంటూ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతు బీమా, దళితబంధు వంటి పథకాలతో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన గొప్ప విజనరీ కేసీఆర్ (KCR). అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రజల నోట్లో మట్టి కొట్టి, ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైంది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు విచారణల పేరుతో కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం దుర్మార్గమైన కక్షసాధింపు రాజకీయానికి నిదర్శనం’’ అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది విచారణ కాదని, ప్రతీకారమన్నారు. నోటీసులతో, బెదిరింపులతో తెలంగాణ చరిత్రను చెరిపేయలేరని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ పార్టీ కక్షసాధింపు రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తోందని కేటీఆర్ (KTR) అన్నారు.


