epaper
Wednesday, February 18, 2026
epaper

కస్టోడియన్‌గా వ్యవహరించాలి… బ్యాంకులకు సుప్రీం ఆదేశం

కలం, తెలంగాణ బ్యూరో : బ్యాంకులపై అపారమైన నమ్మకంతో ప్రజలు వారి కష్టార్జితాన్ని దాచుకుంటారని, ఆ సొమ్ముకు కస్టోడియన్‌గా, ట్రస్టీగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. కేవలం వ్యాపారాన్ని, లాభాలను పెంచుకోవడంపై మాత్రమే దృష్టి పెడితే సరిపోదన్నారు. ప్రజల నమ్మకం వమ్ము కాకుండా వ్యవహరించాల్సిన బాధ్యత కూడా బ్యాంకులపై ఉంటుందని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నొక్కిచెప్పారు. అనుమానాస్పద లావాదేవీలు (Cyber Frauds) జరుగుతున్నట్లు గుర్తించిన వెంటనే దాన్ని అరికట్టే మెకానిజాన్ని రూపొందించుకోవాలన్నారు. టెక్నాలజీని వాడడం ద్వారా ఖాతాదారులను అలర్ట్ చేయాలన్నారు. డిజిటల్ అరెస్టు పేరుతో ప్రజల సొమ్మును సైబర్ నేరగాళ్లు కాజేస్తున్న వ్యవహారానికి సంబంధించిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మలా బాగ్జి, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది.

కస్టమర్లను అప్రమత్తం చేయాలి :

కోట్ల రూపాయల లావాదేవీలు జరిగే కంపెనీన బ్యాంకు ఖాతాలపై సాధారణంగా ట్రాన్సాక్షన్లు జరిగే సమయంలో అనుమానం రాదని గుర్తుచేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం… సామాన్య పౌరుల సేవింగ్స్ అకౌంట్ నుంచి ఒకేసారి పెద్దమొత్తంలో విత్ డ్రా చేసేటప్పుడు తప్పనిసరిగా సందేహపడాల్సి ఉంటుందని పేర్కొన్నది. ఒక పెన్షనర్ లేదా సాధారణ కస్టమర్ తన ఖాతా నుండి రూ. 10,000 లేదా రూ. 20,000 మాత్రమే డ్రా చేస్తూ, అకస్మాత్తుగా రూ. 25 లక్షల నుండి రూ. 50 లక్షల వరకు ఆన్‌లైన్ ద్వారా బదిలీ చేస్తూ ఉంటే, బ్యాంకులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించింది. బ్యాంకులు వాడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ టూల్స్ ఎందుకు అప్రమత్తం చేయడం లేదని నిలదీసింది. బ్యాంకుల్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అమలయ్యేలా రిజర్వు బ్యాంకు ఇప్పటికైనా స్పష్టమైన పర్యవేక్షణ ఉండే మెకానిజాన్ని రూపొందించుకోవాలని సూచించింది.

తాత్కాలిక నిరోధ వ్యవస్థ ఉండాలి :

సైబర్ మోసాలు (Cyber Frauds) జరుగుతున్నట్లు అనుమానం వచ్చిన వెంటనే నిరోధించేందుకు ఆయా అకౌంట్లపై తాత్కాలికంగా ‘డెబిట్ హోల్డ్’ (లావాదేవీల నిలిపివేత) నిబంధన విధించాలని సూచించింది. రిజర్వుబ్యాంకు జారీచేసిన ఎస్ఓపీ అమలుపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సీరియస్ దృష్టి పెట్టాలని బెంచ్ సూచించింది. కేవలం వ్యాపారం, లాభాల కోసమే బ్యాంకులు ఆరాటపడకూడదని, ప్రజల సొమ్ముకు ట్రస్టీలు అనే బాధ్యతను గుర్తుంచుకోవాలని సూచించింది. బ్యాంకుల నిర్లక్ష్యం కారణంగా సైబర్ నేరగాళ్లు ప్రజల సొమ్మును సులువుగా దోచుకుంటున్నారని గుర్తుచేసింది. దేశవ్యాప్తంగా 2021 ఏప్రిల్ నుంచి 2025 నవంబరు మధ్య సుమారు రూ. 52,000 కోట్ల ప్రజా ధనం సైబర్ మోసాల ద్వారా దోపిడీకి గురైందని బెంచ్ గుర్తుచేసింది. అనేక రాష్ట్రాల బడ్జెట్ కంటే ఇది ఎక్కువేనని ఆందోళన వ్యక్తం చేసింది. బ్యాంకులు ఇచ్చిన అప్పుల వసూలు కోసం కోర్టులు రికవరీ ఏజెంట్లుగా మారాల్సిన పరిస్థితి వస్తున్నదని వ్యాఖ్యానించిన చీఫ్ జస్టిస్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు.

Read Also: మాట్లాడనివ్వకపోతే ఎందుకు రావాలి? : ప్రియాంక గాంధీ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>