హైదరాబాద్: అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మపై (Himanta Biswa Sarma) వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ముస్లింల మనోభావాలను ఉద్దేశపూర్వకంగా కించపరిచేలా, రెండు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా హిమంత బిస్వ శర్మ వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా హిమంత బిస్వ శర్మ సోషల్ మీడియా, ముద్రిత మీడియా, బహిరంగ సభల వేదికగా ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేస్తున్నారని ఒవైసీ ఆరోపించారు. ఇటీవల నెలల్లో ఈ తరహా వ్యాఖ్యలను మరింత తీవ్రతరం చేశారని, ఇది జాతీయ సమైక్యతకు భంగం కలిగించే విధంగా ఉందని తెలిపారు.
ఫిబ్రవరి 7, 2026న అస్సాం బీజేపీ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ వీడియోను ఉదహరిస్తూ, అందులో హిమంత బిస్వ శర్మ తుపాకితో ముస్లింలు మీద కాల్పులు జరుపుతున్నట్లుగా చూపించారని ఓవైసీ పేర్కొన్నారు. “పాయింట్ బ్లాంక్ షాట్”, “నో మెర్సీ” వంటి పదాలతో ఆ వీడియోను పోస్ట్ చేయడం ద్వేషాన్ని రెచ్చగొట్టే ఉద్దేశంతోనే జరిగిందని ఆరోపించారు. ఆ వీడియోను తర్వాత తొలగించినప్పటికీ, ఇంకా సోషల్ మీడియాలో అందుబాటులో ఉందని తెలిపారు. సుప్రీంకోర్టు ‘షాహీన్ అబ్దుల్లా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో ఇచ్చిన తీర్పును ఫిర్యాదులో ప్రస్తావించిన ఓవైసీ (Asaduddin Owaisi), ద్వేష ప్రసంగాల విషయంలో ఫిర్యాదు లేకపోయినా పోలీసులు స్వయంప్రతిపత్తితో చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. ఈ వ్యవహారంలో ఎలాంటి జాప్యం జరిగినా అది విధుల నిర్లక్ష్యమే అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని తెలిపారు. హిమంత బిస్వ శర్మపై చట్టప్రకారం తక్షణమే చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీసులను ఒవైసీ కోరారు.
Read Also: బీఆర్ఎస్ పని అయిపోయింది.. కాంగ్రెస్‌ను ఖతం చేయాలి : కిషన్‌రెడ్డి
Follow Us On : WhatsApp


