కలం, నల్లగొండ బ్యూరో: రైతులకు పంట రుణాలు ఇవ్వడంతోపాటు ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Indlu)కు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు రుణాలు ఇవ్వాలని నల్లగొండ కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సమావేశ మందిరంలో నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు ఇస్తున్నప్పటికీ లబ్ధిదారులు ముందుగా బేస్‌మెంట్ వరకు నిర్మించుకోవాల్సి ఉంటుందన్నారు. లబ్ధిదారులు పేదవారు కావడంతో బేస్‌మెంట్ వరకు నిర్మించుకునేందుకు తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలన్నారు. ఈ విషయంలో డీసీసీ (DCC) బ్యాంక్ మేనేజర్లు చొరవ చూపించాలని ఆదేశించారు.
ఇందిర మహిళ శక్తి కార్యక్రమం కింద జిల్లాలోని స్వయం సహాయక మహిళా సంఘాలు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాయన్నారు. ఇందులో భాగంగా వారికి తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చినట్లయితే గ్రూప్ సభ్యులు లాభపడేందుకు అవకాశం ఉంటుందని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతేకాక జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ద్వారా ఇచ్చే రుణాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు. నల్లగొండ (Nalgonda) జిల్లాలో ధాన్యంతోపాటు వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులు పండిస్తున్నారని, కోల్డ్ స్టోరేజీలు, ఆహార ఉత్పత్తులు నిల్వ ఉంచుకునేందుకు రుణ సౌకర్యం అందించాలని చెప్పారు.
డీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో స్థలాలను గుర్తించి గోడౌన్ నిర్మించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. రబీ ప్రారంభమవుతున్న దృష్ట్యా ధాన్యం కొనుగోలుకు సంబంధిత సొసైటీలు ముందే కొనుగోలు కేంద్రాలను సందర్శించాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోలుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ చెప్పారు.

