కలం, ఖమ్మం బ్యూరో: దశాబ్దాల తరబడి అపరిస్కృతంగా ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల (Housing Plot) సమస్యను సత్వరమే పరిష్కరించాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డిలను తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ టీజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి చిర్రా రవి, ఇతర జర్నలిస్టులు నిలదీశారు.
ఖమ్మం (Khammam) జిల్లా కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన అధికారిక కార్యక్రమంలో ముగ్గురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే టీజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ, జర్నలిస్టులు తమ సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా జర్నలిస్టులకు తక్షణమే ఇళ్లస్థలాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. చివరకు మంత్రులు స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో జర్నలిస్టులు శాంతించారు.

