’వెలుగుమట్ల’పై పోరాటం కొనసాగిస్తాం.. నిరాహార దీక్ష విరమించిన కవిత..

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (kavitha) నిరాహార దీక్షను విరమించారు. వెలుగుమట్ల బాధితులకు ఇండ్ల పట్టాలను పంపిణీ చేయడంతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య నిమ్మరసం ఇచ్చి కవిత, విశారదన్ మహారాజ్ దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. వెలుగుమట్ల బాధితుల ఇండ్లను అర్ధరాత్రి కూల్చడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అన్నారు. ‘అర్హుల ఇండ్లు కూల్చిన అధికారులపై ముందు కేసులు పెట్టాలి. ఘటన జరిగిన తర్వాత చాలా పార్టీల నేతలు అక్కడకు టూరిస్టుల్లాగా వెళ్లి వచ్చారు. కానీ మేం వెళ్లి చూస్తే ఇండియాలో ఉన్నామా లేదంటే ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నామా అనిపించింది. అందుకే వాళ్లకు ఇండ్లు కట్టించి ఇచ్చేదాకా వదలొద్దని సీరియస్ గా తీసుకున్నాం’ అంటూ కవిత తెలిపారు.

అందుకే నిరాహార దీక్ష చేశాం..

ఇండ్లు కూల్చిన అధికారులే వారికి ఆ భూమి మీద హక్కులు లేవంటూ అవమానించారని కవిత (kavitha) చెప్పారు. ‘పేదలను కొట్టి ఆ భూమిని కొందరు పెద్దలకు అప్పగించే కుట్ర జరుగుతోందని మాకు అర్థమైంది. ఈ ఘటనపై ఎలాంటి పోరాటం చేద్దామని విశారదన్ మహారాజ్ గారితో మాట్లాడాను. ఇతర పార్టీల్లాగా కాకుండా నిరాహార దీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నాం. కానీ పోలీసులు విశారదన్ మహారాజ్ ను, నన్ను అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. పోలీసులు మమ్మల్ని ఎక్కడ వదిలేశారో అక్కడే మేం దీక్ష కొనసాగించాం. భూమి ఆక్రమించుకున్నారని మొన్నటి వరకు చెప్పిన మంత్రులు…ఇవ్వాళ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ అర్హులు ఉన్నారని చెబుతున్నారు. పోలీసు కమిషనరే స్వయంగా ల్యాండ్ ఓనర్లను వెకేట్ చేయించామని ట్వీట్ చేశారు. ప్రైవేట్ ప్రాపర్టీలోకి వచ్చి పేదల ఇళ్లు కూలగొట్టడానికి ప్రభుత్వానికి ఎంత ధైర్యం. ఇది రాజ్యాంగాన్ని అవమానించడమే’ అని కవిత చెప్పారు.

మళ్లీ వెళ్తాం..

రాజ్యాంగాన్ని పట్టుకొనే తిరిగే రాహుల్ గాంధీ ఈ ఘటనకు బాధ్యత తీసుకోవాలని.. ప్రభుత్వం దీనికి క్షమాపణలు చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. ‘వెలుగు మట్లలో ఇవాళ 310 మందికి స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని చెప్పారు. కానీ మంత్రులు ఇచ్చిన టోకెన్ లపై అనుమానం ఉంది. లే అవుట్ చేసి ఫిజికల్ ప్రాపర్టీని ప్రతి కుటుంబానికి చూపించే దాకా ఇచ్చే వరకు పోరాటం చేస్తాం. అక్కడ చాలా మంది 30 లక్షలు పెట్టి ఇండ్లు కట్టుకున్నారు. ఇప్పుడు మీరు రూ.5లక్షలు ఇస్తే మిగతా నష్టం ఎవరు భరిస్తారు. బాధితులకు సంపూర్ణ న్యాయం జరిగిందా లేదా అన్నది మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసుకుంటాం. జస్టిస్ ఈశ్వరయ్య గారి సమక్షంలో మళ్లీ బాధితులతో వెళ్లి మాట్లాడుతాం’ అని కవిత వెల్లడించారు.

వాటన్నింటినీ కాజేయాలని కుట్ర..

ఖమ్మంలో భూదాన్ భూముల్లో ఉన్న కూల్చివేతలను ప్రభుత్వం ట్రయల్ గా పరీక్షించిందన్నారు కవిత. ‘రాష్ట్రంలో ఉన్న లక్షా 74 వేల ఎకరాల భూదాన్ భూములపై ప్రభుత్వ పెద్దల కన్ను పడింది. వెలుగుమట్ల విషయంలో వ్యతిరేతక రాకుంటే అవన్నీ కాజేయాలని కుట్ర చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వాటిపై శ్వేతపత్రం విడుదల చేయాలి. భూదాన్ భూములన్నీ పేదలవే.. మేం అధికారంలోకి వచ్చాక వాటిని పేదలకు పంచేస్తాం. వెలుగుమట్ల మహిళల పట్టుదల వల్లే వారికి తక్షణ న్యాయం జరిగింది. నాపై కేసు ఎత్తేయకున్నా పర్లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ, జాగృతి కార్యకర్తలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి’ అని కవిత డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>