కలం, స్పోర్ట్స్ : సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో తన ఫామ్ కోల్పోయాడు. పరుగులు చేయడానికి నానా తిప్పలు పడుతున్నారు. అతడు విఫలమయవుతున్నా జట్టు గెలుస్తుండటమే తనకు ముఖ్యమని భారత టీ20 కెప్టెన్ తెలిపారు. జూన్ 2024లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత జట్టు ఒక్క టీ20 సిరీస్ కూడా ఓడిపోలేదు. తాజాగా దక్షిణాఫ్రికాను 3–1తో ఓడించింది. జనవరి 21న నాగ్‌పూర్‌లో న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది.
2025లో సూర్యకుమార్ 19 ఇన్నింగ్స్‌ల్లో 218 పరుగులు మాత్రమే చేశారు. ఒక్క అర్ధశతకం కూడా నమోదు కాలేదు. అయినా తన బ్యాటింగ్ శైలిని మార్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. తనకు విజయాన్ని అందించిన ఆటనే కొనసాగిస్తానని చెప్పారు. పరుగులు రావాల్సిన సమయంలో తప్పకుండా వస్తాయని నమ్మకం వ్యక్తం చేశారు. రాకపోతే మరింత కష్టపడి బలంగా తిరిగి వస్తానని తెలిపారు.

క్రికెట్ జట్టు ఆట అని వ్యక్తిగత మైలురాళ్లు అంత ముఖ్యమేమీ కాదని సూర్యకుమార్ అన్నారు. జట్టు గెలిస్తే అదే తనకు పెద్ద సంతృప్తి అని చెప్పారు. నాయకుడిగా ఆటగాళ్లు సహాయక సిబ్బంది బాధ్యత తనపై ఉందని తెలిపారు. ప్రతి ఆటగాడు ముందుకు వచ్చి బాగా ఆడాలని సూచించారు. ఒకరి విజయాన్ని మరొకరు ఆనందించడమే నిజమైన జట్టు స్ఫూర్తి అని సూర్యకుమార్ యాదవ్ అన్నారు.


