epaper
Tuesday, January 20, 2026
spot_img
epaper

ఏఐ రంగంలో తెలంగాణతో భాగస్వామ్యానికి రాయల్ ఫిలిప్స్ ఆసక్తి

కలం, వెబ్​డెస్క్​ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో తెలంగాణతో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రముఖ హెల్త్ టెక్ సంస్థ రాయల్ ఫిలిప్స్ ఆసక్తి వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లో నాలెడ్జ్ హబ్ ఏర్పాటు అవకాశాలపైనా చర్చించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు దావోస్​ సదస్సు (Davos summit)లో తెలంగాణ ప్రతిపాదనకు రాయల్ ఫిలిప్స్ వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ హెడ్ జాన్ విల్లెమ్ స్కీజ్ గ్రాండ్ అంగీకరించారు. ఏఐ రంగంలో తెలంగాణ చేపడుతున్న కార్యక్రమాలు తమను ఆకట్టుకున్నాయని ఆయన చెప్పారు. ముఖ్యంగా ఆరోగ్య రంగంలో తెలంగాణ అమలు చేస్తున్న ఏఐ ఆధారిత సేవలపై ప్రశంసలు కురిపించారు.

ప్రపంచ ఆర్థిక వేదిక–2026 వార్షిక సమావేశాల్లో భాగంగా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న సదస్సు(Davos summit) లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందం పాల్గొంటున్న సంగతి తెలిసిందే. మంగళవారం ఈ బృందం రాయల్​ ఫిలిప్స్ గ్లోబల్ నాయకత్వంతో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా ‘తెలంగాణ నెక్స్ట్–జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–2030’ గురించి వివరించింది. 2030 నాటికి 250 బిలియన్ డాలర్ల లైఫ్ సైన్సెస్ ఆర్థిక వ్యవస్థ నిర్మించడమే ఈ విధానం లక్ష్యమని, మెడికల్, ఎలక్ట్రానిక్స్ సహా అనుబంధ రంగాలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తెలిపింది.

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఔషధ తయారీ, పరిశోధనాభివృద్ధి (ఆర్అండ్​డీ) రంగాల్లో ప్రపంచ స్థాయి, స్థిరమైన పారిశ్రామిక క్లస్టర్‌ తెలంగాణలో నిర్మిస్తున్నామని వివరించారు. ‘తెలంగాణ రైజింగ్–2047’ విజన్‌లో భాగంగా ఔటర్ రింగ్ రోడ్ (ORR) , రీజినల్ రింగ్ రోడ్ (RRR) మధ్యనున్న పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ (PURE)ని తయారీ, లాజిస్టిక్స్ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. కొత్త లైఫ్ సైన్సెస్ విధానం, ఔషధ తయారీ వ్యూహాలు కలిసి తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు పునాది వేస్తాయన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 2వేలకు పైగా లైఫ్ సైన్సెస్ సంస్థలు, బలమైన ఐటీ–లైఫ్ సైన్సెస్–హెల్త్ కేర్ టాలెంట్ బేస్, జీనోమ్ వ్యాలీ, 300 ఎకరాలకుపైగా విస్తరించిన మెడికల్ డివైజెస్, మెడికల్ ఎలక్ట్రానిక్స్ పార్క్ ఉన్నాయని మంత్రి వివరించారు.

హైదరాబాద్ వైద్య పర్యాటకానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, ఇక్కడి ఆస్పత్రులు ఇప్పటికే క్రిటికల్ కేర్, అంబులెన్స్ సేవలు వంటి రంగాల్లో ఏఐని సమర్థంగా వినియోగిస్తున్నాయని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. హైదరాబాద్‌ను ఏఐ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా ఏఐ సిటీని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ‘హైదరాబాద్‌లో నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేయడానికి ఇది సరైన సమయం, ఉత్తమ అవకాశమని’ మంత్రి వివరించారు. తెలంగాణకు వచ్చి.. జీనోమ్ వ్యాలీని సందర్శించాలని ఫిలిప్స్ నాయకత్వాన్ని మంత్రి ఆహ్వానించారు.

దీనిపై స్పందించిన రాయల్​ ఫిలిప్స్​ ప్రతినిధి జాన్ విల్లెమ్ స్కీజ్ ఏఐ రంగంలో తెలంగాణతో భాగస్వామ్యానికి ఆసక్తి చూపారు. అలాగే, నెదర్లాండ్స్​లోని తమ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించాలని తెలంగాణ రైజింగ్ (Telangana Rising Team) ప్రతినిధి బృందాన్ని ఆయన కోరారు.

Read Also: దావోస్‌లో తెలంగాణ రైజింగ్​ బృందం బిజీ బిజీ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>