కలం, వరంగల్ బ్యూరో: తప్పు చేసిన వాళ్లను తమ ప్రభుత్వం వదిలిపెట్టబోదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) పేర్కొన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదల శ్రేయస్సు కోసం పని చేస్తుందన్నారు. ఇది పేదోళ్ల ప్రభుత్వమని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం అరకొర పనులు మాత్రమే చేసిందని చెప్పుకొచ్చారు. విద్యార్థులకు కనీసం తిండి కూడా పెట్టక పోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాస్మొటిక్ చార్జెస్ పెంచి విద్యార్థులకు చేయూత ఇచ్చామన్నారు.
బీఆర్ఎస్ పాలనలో అంతా అవినీతే
బీఆర్ఎస్ పాలనలో అంతా అవినీతే జరిగిందని మంత్రి పొంగులేటి ఆరోపించారు. పేదోళ్లకు ఇల్లు కట్టిస్తే కమీషన్లు దొరకవన్న కారణంతో కాళేశ్వరం కట్టి డబ్బులు దండుకున్నారని మండిపడ్డారు. పార్టీలకతీతంగా ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తున్నామని చెప్పారు. కేసీఆర్ వరి వేస్తే ఉరి అని ప్రచారం చేశారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వంలో రైతులకు రుణమాఫి, రైతు భరోసా ఇచ్చి ఆదుకుంటున్నామని చెప్పారు. కేసీఆర్ దొర పోకడలకుపోయి జనాన్ని విస్మరించారని ఆరోపించారు. అధికారం పోయిందన్న అక్కసుతో తమ ప్రభుత్వంపై నిందలేస్తున్నారని దుయ్యాబట్టారు. అనాలోచితంగా తండాలను మున్సిపాలిటీ లో కలిపి ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. అర్హులైన వారికి 200 యూనిట్ల కరెంట్, ఉచిత బస్సు, సన్న బియ్యం లాంటి పథకాలు అందుతున్నాయన్నారు.
ఇందిరమ్మ ఇండ్లకు సకాలంలో డబ్బులు: ఎంపీ కావ్య
ఇందిరమ్మ ఇళ్లకు సకాలంలో డబ్బులు పడుతున్నాయంటే అది మంత్రి పొంగులేటి (Ponguleti Srinivas Reddy) గొప్పతనమేనని ఎంపీ కడియం కావ్య పేర్కొన్నారు. రానున్న రోజుల్లో అభివృద్ధి కావాలంటే మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసి గెలుపించాలని కోరారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ కొందరు దృతరాష్ట్రుల పాలనలో వర్ధన్నపేటలో అభివృద్ధి జరగలేదన్నారు. గత పాలకులు ఈ నియోజకవర్గం పై సవతి ప్రేమ చూపారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్, మాజీ టెస్కాబ్ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు, టిపిసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, హన్మకొండ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పింగిలి వెంకట్రాం నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, ఐనవోలు ఆలయ కమిటీ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Read Also: మున్సి’పోల్స్’ ముందు బీజేపీకి షాకిచ్చిన మాజీ ఎమ్మెల్యే
Follow Us On: Instagram


