కలం, వరంగల్ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీకి (BJP) షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ (Aroori Ramesh) బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇన్నిరోజులు పార్టీలో తనకి సహకరించిన బీజేపీ పెద్దలకి, నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఆహ్వానం మేరకు అనుచరులు, అభిమానులతో కలిసి సొంతగూటికి చేరుతున్నట్టు స్పష్టం చేశారు.
ఆరూరి రమేష్ 2009లో ప్రజా రాజ్యం పార్టీ తరపున వరంగల్ జిల్లా, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) లో చేరారు. వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మూడవసారి 2023 లో అదే నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగి ఓటమిపాలయ్యారు.
2024లో లోక్ సభ ఎన్నికల ముందు బీజేపీలో చేరిన ఆరూరి రమేష్ వరంగల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వరంగల్ స్థానిక సంస్థల ఎన్నికలు, ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో ఆయన మద్దతుదారులు భారీ ఓటమి చూశారు. దీంతో భవిష్యత్తు రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, బీఆర్ఎస్ ఆహ్వానం మేరకు తిరిగి ఆయన సొంతగూటికి చేరుతున్నట్టు ఆరూరి వర్గీయులు చెబుతున్నారు.

Read Also: తప్పు చేసినోళ్లను వదిలిపెట్టం: పొంగులేటి
Follow Us On: Instagram


