కలం, వెబ్ డెస్క్ : ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో భాగంగా సంతోష్ రావు విచారణ ముగిసింది. మంగళవారం బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు (Santhosh Rao)ను ప్రత్యేక విచారణ బృందం (SIT) సుదీర్ఘంగా విచారించింది. ఉదయం ప్రారంభమైన ఈ ప్రక్రియ సుమారు ఏడు గంటల పాటు కొనసాగింది. గతంలో మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ లను ప్రశ్నించిన అధికారులు, ఇప్పుడు సంతోష్ రావును విచారించారు.
ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయనకు ఉన్న సంబంధాలు, అధికారులతో జరిపిన సంభాషణలు, క్షేత్రస్థాయిలో జరిగిన పరిణామాలపై సిట్ అధికారులు కీలక ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలను వరసగా విచారణకు పిలుస్తుండటంతో ఈ దర్యాప్తు ఎటు దారితీస్తుందో అన్న చర్చ సర్వత్రా సాగుతోంది.
బీఆర్ఎస్ ముఖ్య నేతలను ఒక్కొక్కరిగా విచారిస్తున్న తీరును గమనిస్తుంటే, తదుపరి వంతు ఎవరిదన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే పార్టీ నేతలు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులను సిట్ విచారించిన నేపథ్యంలో, త్వరలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ప్రస్తుతానికి సంతోష్ రావు (Santhosh Rao) ఇచ్చిన వాంగ్మూలాన్ని విశ్లేషిస్తున్న అధికారులు, సేకరించిన ఆధారాలను బట్టి తదుపరి చర్యలను చేపట్టనున్నారు. మరి సిట్ అధికారులు తదుపరి ఎవరికి నోటీసులు ఇస్తారో, ఈ విచారణ ప్రక్రియ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.
Read Also: కేసీఆర్ ఫ్యామిలీలో పంపకాల పంచాయితీ: ఎంపీ చామల
Follow Us On: Instagram


