కలం, వెబ్ డెస్క్ : విశాఖపట్నం (Visakhapatnam)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని బిహెచ్‌పివి (BHPV) జంక్షన్ వద్ద అతివేగంగా వచ్చిన ఒక లారీ నియంత్రణ కోల్పోయి, అక్కడ ఆగి ఉన్న వాహనాలపైకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ భీకర ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లారీ ధాటికి ఒక కారుతో పాటు రెండు ద్విచక్ర వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
మృతుల్లో ఒకరిని రామకృష్ణగా గుర్తించారు. ఆయన తన కుమార్తెతో కలిసి సింహాచలం దర్శనానికి వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. మరో మృతుడిని సతీష్‌గా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో అక్కడ ఉన్న వాహనదారులు, స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.

