కలం, తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping Case) వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ (SIT) పోలీసులు నోటీసు జారీ చేయడం ఆ పార్టీ కేడర్‌లోనే కాక రాష్ట్ర రాజకీయాల్లోనే కీలక చర్చగా మారింది. ఇంతకాలం నోటీసులు ఇస్తారో.. ఇవ్వరో.. అనే సందేహం నెలకొన్నది. నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణకు వస్తారో.. గైర్హాజరవుతారో.. అనే చర్చ జరిగింది. చివరకు హాజరవుతానుగానీ.. అంటూ ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో జరగాలి.. అంటూ షరతు పెట్టారు. ఎట్టకేలకు ఆయన విచారణకు సమ్మతి తెలపడంతో అంశం ప్లస్ అవుతుందా?.. లేక మైనస్‌గా మారుతుందా?.. విచారణ తర్వాత చార్జిషీట్‌లో ఎలాంటి అభియోగాలు నమోదవుతాయో?.. కాళేశ్వరం విచారణకు హాజరైన తర్వాత జస్టిస్ పీసీ ఘోష్ నిందితుడిగా పేర్కొన్నట్లుగా ఇప్పుడూ అదే రిపీట్ అవుతుందా?.. ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్ ఎలాంటి ప్రభావం చూపుతుంది?.. ఇలాంటివన్నీ కేడర్ మధ్య చర్చనీయాంశాలుగా మారాయి.
ఫామ్‌హౌజ్ సెలక్షన్ తప్పుడు నిర్ణయమా? :
ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) ‘సిట్’ విచారణకు సిద్ధమైన కేసీఆర్.. ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌కు బదులుగా జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌కే వెళ్తే బాగుండేదన్న అభిప్రాయాలు ఆ పార్టీ శ్రేణుల నుంచి వ్యక్తమయ్యాయి. కాళేశ్వరం ఎంక్వయిరీ కమిషన్ విచారణకు బీఆర్‌కేఆర్ భవన్‌కు వెళ్ళినప్పుడు కేసీఆర్ విమర్శలపాలయ్యారు. ఆ ఎంక్వయిరీ ప్రక్రియను జస్టిస్ ఘోష్ ‘ఓపెన్ హౌజ్ కోర్టు’ అని పేర్కొన్నారు. కానీ ఎంక్వయిరీకి హాజరైన కేసీఆర్ మాత్రం జర్నలిస్టులను బైటకు పంపించాలని, ఏకాంతంగానే విచారణ జరగాలని షరతు పెట్టారు. దీనికి జస్టిస్ ఘోష్ సైతం సానుకూలంగా స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) నిర్మాణంలో ఏ లోసుగులూ లేనప్పుడు జస్టిస్ ఘోష్ నిర్వహించే ఎంక్వయిరీకి షరతు పెట్టాల్సిన అవసరమేమొచ్చిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశంలోనూ అలాంటి మాటలే వినిపిస్తున్నాయి.
పోలీస్ స్టేషన్‌కే వెళ్తేనే బాగుండేది.. :
పోలీసుల్ని తన దగ్గరకు పిలిపించుకునే బదులు తానే పోలీసు స్టేషన్‌కు వెళ్తే సానుభూతి వచ్చి ఉండేదని పార్టీ కేడర్ అభిప్రాయపడుతున్నారు. సిట్ పోలీసుల నోటీసుకు షరతులేవీ ఇవ్వకుండా హాజరై ఉండాల్సిందన్న భావన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని స్టేషన్‌కు పిలిపించుకుని ప్రశ్నిస్తారా?.. ఆయన కట్టించిన పోలీసు స్టేషన్‌లోనే ఆయనను ఒక దోషి అనే తరహాలో విచారిస్తారా?.. తెలంగాణ కోసం కొట్లాడి పదేండ్లు పరిపాలించిన వ్యక్తికి పోలీసులు ఇచ్చే గౌరవం ఇదేనా?.. కేసీఆర్‌ను ఆయన ఫ్యామిలీ మెంబర్లను సీఎం రేవంత్‌రెడ్డి అవమానిస్తున్నారు?.. పనిగట్టుకుని రాజకీయంగా ప్రతీకారం తీర్చుకుంటున్నారు.. ఇలాంటి అభిప్రాయాలను కేడర్ వ్యక్తం చేశారు. ఇవన్నీ ప్రజల్లో సెంటిమెంటల్‌గా ఎమోషన్స్ కు గురిచేసి ఉండేవని, మున్సిపల్ ఎన్నికల్లో సానుభూతి పవనాలతో ఓట్లు రాలేవని అభిప్రాయపడ్డారు.
Read Also: ఆ 2 అంశాలపై మంత్రులతో సీఎం డీప్ డిస్కషన్
Follow Us On: Pinterest


