కలం, తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ అంశంలో విచారణపై సిట్ (SIT) పోలీసులకు కేసీఆర్ (KCR) రాసిన లేఖ రాష్ట్రంలో సరికొత్త చర్చకు దారితీసింది. “భవిష్యత్తులో అన్ని నోటీసులనూ ఎర్రవల్లి ఫామ్ హౌజ్ అడ్రస్‌కే పంపాలి” అని ఆ లేఖలో కేసీఆర్ స్పష్టం చేశారు. దీంతో ఇకపైన తన అడ్డా, అడ్రస్ అన్నీ ఎర్రవల్లి ఫామ్ హౌజే అని రూఢీ చేసినట్లయింది. రాష్ట్రంలో అధికారం చేజారిన తర్వాత కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కే పరిమితం కావడంపై ముఖ్యమంత్రి సహా మంత్రులు, కాంగ్రెస్ నేతలు, బీజేపీ నాయకులు అనేక రకాల విమర్శలు చేశారు. ప్రజల మధ్యకు రాని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటూ చాలా రకాల విమర్శలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇకపైన నోటీసులన్నీ అక్కడికే పంపాలంటూ ఫామ్ హౌజ్ అడ్రస్‌ను చెప్పడంతో ఇంతకాల రాజకీయ నాయకులు చేసిన విమర్శలను సర్టిఫై చేసినట్లయింది. ప్రజలకు సైతం కేసీఆర్ ఇకపై ఫామ్ హౌజ్‌కే పరిమితం అనే మెసేజ్ ఇచ్చినట్లయింది. లేఖలో ఎర్రవల్లి ఫామ్ హౌజ్ అడ్రస్‌ను “ఇం.నెం. 3-96, ఎర్రవల్లి గ్రామం, మర్కూక్ మండలం, సిద్దిపేట జిల్లా, తెలంగాణ – 502279” అని పేర్కొన్నారు.
సీఎం మాటలను నిజం చేసిన కేసీఆర్ :
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అనేక సందర్భాల్లో కేసీఆర్‌పైనా, ఆయన ఫామ్‌హౌజ్‌కు పరిమితం కావడంపైనా ఘాటు విమర్శలు చేశారు. “ప్రజలు ఐదేళ్ల కోసం ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ఆయన మాత్రం ఫామ్ హౌజ్‌కే పరిమితమై జీతాలు తీసుకుంటున్నారు. ఇది ప్రజలను అవమానించడమే.” అంటూ ఇదే నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వ్యాఖ్యానించారు. “ఆయనుంటున్న ఫామ్ హౌజ్‌కు, చర్లపల్లి జైలుకు పెద్ద తేడా ఏమీ లేదు… అక్కడ పర్యవేక్షణ ఉంటుంది… ఇక్కడ పహారా ఉంటుంది అంతే… తనను తాను ఫామ్‌హౌజ్‌లో బంధించుకున్నారు…” అని గతేడాది ఆగస్టులో వ్యాఖ్యానించారు. “ఇప్పుడాయన్న చెల్లని నోటుతో సమానం… ప్రజలతో బంధం తెగిపోయింది కాబట్టే ఫామ్‌హౌజ్‌లో పడుకుంటున్నారు… పదేండ్లలో రాష్ట్ర సంపదను దోచుకుని ప్రజలకు ముఖం చూపించలేక అక్కడే ఉండిపోతున్నారు..” అని అన్నారు. ఇలాంటి కామెంట్లన్నింటికీ కేసీఆర్ తాజా లేఖలో పేర్కొన్న వివరణతో ‘ఔను’ అనే సమాధానం ఇచ్చినట్లయింది.
తాజా లేఖలో ప్రజలకూ క్లారిటీ :
గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచినా నియోజకవర్గంలో పర్యటించడంలేదని, ప్రజల సమస్యలకు పరిష్కారం దొరకడంలేదని, ఆయనను కలవాలన్నా వీలు పడడంలేదని ఇటీవలే ఆ నియోజకవర్గ జనం, కాంగ్రెస్ కార్యకర్తలు ఎర్రవల్లి ఫామ్ హౌజ్ (Erravalli Farmhouse) ముందు ధర్నా చేశారు. ఇటీవలే “మా ఎమ్మెల్యే కనిపించడంలేదు..” అంటూ పోస్టర్లు వెలిశాయి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ అసెంబ్లీకి హాజరుకాకపోవడంపైనా ప్రజల్లో చర్చ జరిగింది. రైతు సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి విజయపాల్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. అసెంబ్లీకి హాజరయ్యేలా ఆదేశించాలని, లేనిపక్షంలో ఆయనను డిస్‌క్వాలిఫై చేయాలని లేదా ఆయనకు ప్రభుత్వం నుంచి జీతభత్యాలను ఆపివేయాలని కోరారు. కానీ శాసన వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేమని, ఎమ్మెల్యేకు అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ‘గజ్వేల్ ఎమ్మెల్యే మిస్సింగ్’ అంటూ అక్కడి పోలీసు స్టేషన్‌లో కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రీకాంతరావు ఫిర్యాదు చేశారు. ఇలాంటి నిరసనలు, ఫిర్యాదుల నేపథ్యంలో ఇకపైన ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌కే నోటీసులు పంపాలంటూ పోలీసులకు రాసిన లేఖలో కేసీఆర్ (KCR) పేర్కొనడం గమనార్హం.
Read Also: బీసీ రిజర్వేషన్లపై అనుమానాలు
Follow Us On: Instagram


