కలం, వెబ్ డెస్క్ : దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీని తన భుజస్కందాలపై మోసిన సీనియర్ నాయకులలో జీవన్ రెడ్డి ఒకరు. తెలంగాణలో ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ భవితవ్యం, దశాబ్దాల క్రితం కనుమరుగయ్యే దిశగా సాగినా.. పార్టీని విడిచిపెట్టకుండా పార్టీ తోనే తన ప్రాణం అన్నట్లుగా రాజకీయ జీవన పయనాన్ని కొనసాగించిన సీనియర్ నాయకుడు ఆయన. కాంగ్రెస్ లోనే నాలుగు దశాబ్దాల రాజకీయ జీవన పయనాన్ని జీవన్ రెడ్డి(Jeevan Reddy) కొనసాగించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో, కేసీఆర్ ప్రభుత్వంలో పదేళ్లు ప్రతిపక్షంగా ఉన్న సమయంలోనూ పార్టీకి అండగా ఉంటూ.. పార్టీని క్షేత్ర స్థాయిగా బలోపేతం దిశగా అనుక్షణం పనిచేసిన నాయకుడిగా జీవన్ రెడ్డి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ నాయకుడి రాజకీయ భావితవ్యమే ఎడారిలో దిక్కు తెలియని విధంగా మారింది. ఆయన మౌన వేదన, పార్టీకి ఆయన చేసిన కృషి, పార్టీ కోసం పరితపించి చేసిన పనిని సీఎం రేవంత్ రెడ్డి పాలనలో గుర్తించకపోవడంతో జీవన్ రెడ్డి బరువెక్కిన గుండెతో రగిలిపోతున్నారు. దశాబ్దాలుగా పార్టీకి చేసిన సేవలు అన్నీ నిష్ఫలమేనా? అనే విషయం తన మనసుని కలచి వేస్తోంది. జగిత్యాల నియోజకవర్గంలో జీవన్ రెడ్డి అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే జీవన్ రెడ్డి అనే రీతిలో రాజకీయాలు సాగాయి. గత కొంత కాలంగా పార్టీ అంతర్గత పరిణామాలు ఆయనను తీవ్రంగా కలిచి వేస్తున్నాయి. ఎంతో మందికి మంత్రి పదవులు ఇచ్చారని.. ఒక సీనియర్ నాయకుడిగా తాను కూడా మంత్రి పదవికి అర్హుడేనని బహిరంగంగా ఎన్ని సార్లు చెప్పినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుందని మనోవేదనకు గురవుతున్నారు.
జగిత్యాల నియోజకవర్గంలో తాజాగా బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సంజయ్ కుమార్(Sanjay Kumar).. తనపై ఆధిపత్యం చెలాయిస్తున్నాడని, సీనియర్ నాయకుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ పలు మార్లు జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎన్నిసార్లు గొడవలు, పార్టీ వర్గాల నాయకుల మధ్య కొట్లాటలు జరిగినా కాంగ్రెస్ నాయకులు బుజ్జగించే పనులు చేశారే గాని.. తన మంత్రి పదవిపై ఎవరూ పెదవి విప్పట్లేదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే చాలా సార్లు పార్టీ మంత్రులు, పెద్దలు పలు మార్లు బుజ్జగించారు. అయినా జీవన్ రెడ్డిని రాజకీయ అసంతృప్తి వెంటాడుతోంది.
తన రాజకీయ భవిష్యత్తుపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి ఎలాంటి నిర్ణయం తీసుకోకవపోడంతో జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలోనే నిన్న జీవన్ రెడ్డి మీడియా సమావేశంలో తన మనసులోని బాధను వెల్లడించారు. జగిత్యాల ఎమ్మెల్యే (సంజయ్ కుమార్ ను ఉద్దేశించి) ఏ పార్టీలో ఉన్నారో తెలియదు కానీ, ఆయనతో కలిసి పనిచేయాలని తనకు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి కోసం సర్కారుతో కలిసి పనిచేయడం తప్పులేదు కానీ.. హక్కులను కాలరాయడం, అభ్యర్థులను ఎంపిక చేయడం ఇవన్నీ కరెక్టేనా? అంటూ కాంగ్రెస్ పార్టీని నిలదీశారు. కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాల దృష్ట్యా పార్టీ మారాలని అనుకుంటున్నట్లు తెలిపారు. పార్టీ మారాలని తనకు వచ్చిన ఈ ఆలోచనకు తనలోని ఆవేదనే కారణమని చెప్పారు.
కోపంలో జీవన్ రెడ్డి అన్నంత పని చేస్తారని.. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్‌ఎస్ తీర్ధం పుచ్చుకుంటారన్న ఊహాగానాల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు దిగొచ్చారు. బుధవారం జగిత్యాలలోని ఆయన ఇంటికి ఏఐసీసీ(AICC) నేతలు వెళ్లారు. జీవన్ రెడ్డిని నేషనల్ కో ఆర్డినేటర్, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ ప్రొ.కత్తి వెంకటస్వామి(Kathi Venkataswamy) కలిశారు. పార్టీ మారొద్దని.. సమయం వచ్చినప్పుడు మీకు తగిన పదవిని కాంగ్రెస్ ఇస్తుందని జీవన్ రెడ్డిని బుజ్జగించినట్లు తెలుస్తోంది. దాదాపు గంటకుపైగా చర్చలు సాగినట్లు సమాచారం. అయితే జీవన్ రెడ్డి సైతం తన రాజకీయ భవితవ్యంపై మాంచి క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది. తనకు అవమానం కలిగిస్తోన్న కాంగ్రెస్ పార్టీ, నేతలకు తగిన బుద్ధి చెప్పేందుకు పార్టీ మారుతామని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 25న జగిత్యాలలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని జీవన్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు పొలిటికల్ చర్చ జరుగుతోంది. ఈ వేదికపైనే ఆయన తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి, వేలాది మంది అనుచరులతో కలిసి బీఆర్‌ఎస్ తీర్ధం పుచ్చుకోనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్‌తో ఆయనతో సాన్నిహిత్యంగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు పలు కోణాల్లో విశ్లేషిస్తున్నారు.
అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించేందుకు ఈ అవకాశాన్ని బీఆర్ఎస్ (BRS) గట్టిగా వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది. అత్యంత సీనియర్ నేతకే విలువ ఇవ్వని పార్టీ కాంగ్రెస్ అంటూ ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ పై అస్త్రాలు సంధించేందుకు జీవన్ రెడ్డి అంశం ఉపయోగపడుతుందని ఆలోచిస్తోంది. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవాన్ని ఉపయోగించుకునే యోచనలో గులాబీ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ ను క్లీన్ స్వీప్ చేసేందుకు జీవన్ రెడ్డి అంశం ఎంతగానో ఉపయోగపడుతుందని గులాబీ బాస్ సీనియర్ నేతలతో సమాలోచనలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. దశాబ్ద కాలంగా రాష్ట్రాన్ని పాలించిన పార్టీ ఇటీవల ఎన్నికల్లో ఓటమి చెందడంతో బీఆర్ఎస్ పార్టీ బలం కొంత తగ్గినట్లయింది. అటు సీనియర్ నేత ఈటల రాజేందర్, కవిత పార్టీకి దూరమవటం గులాబీ పార్టీకి మాయని మచ్చగా మిగిలింది. సీనియర్ నేత జీవన్ రెడ్డికి సైతం ఆశ్రయం ఇవ్వడంతో ప్రజల్లో సానుభూతి పొంది జీవన్ రెడ్డికి ఫాలో అయ్యేవారి ఓట్లన్నీ బీఆర్ఎస్ కు పడితే పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉందని గులాబీ నేతలు చర్చిస్తున్నారు. మరి జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు షాక్ ఇచ్చి బీఆర్ఎస్ లో చేరుతారా? ఈ అంశంపై గులాబీ బాస్ కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

