epaper
Thursday, January 29, 2026
spot_img
epaper

ఆ 2 అంశాలపై మంత్రులతో సీఎం డీప్ డిస్కషన్

కలం, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఫిబ్రవరి 2న మంత్రులతో జరపనున్న మీటింగ్‌పై ఉత్కంఠ నెలకొన్నది. దావోస్‌ సమ్మిట్‌కు ఈ నెల 19న వెళ్ళిన సీఎం కెన్నడీ స్కూల్‌లో ప్రోగ్రామ్ ట్రెయినింగ్ కోసం అమెరికా వెళ్ళారు. తిరిగి ఫిబ్రవరి 1న నగరానికి చేరుకుంటున్నారు. దాదాపు రెండు వారాల తర్వాత రాష్ట్రానికి వస్తున్నారు. వెంటనే రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, పరిపాలనా సంబంధమైన విషయాలపై మంత్రులతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ రెండు వారాల వ్యవధిలో సింగరేణి (Singareni) బొగ్గు గనుల మైనింగ్ టెండర్ల రద్దు, విపక్ష బీఆర్ఎస్ చేస్తున్న తీవ్ర విమర్శలు, ఫోన్ ట్యాపింగ్‌లో (Phone Tapping) పలువురిని సిట్ (SIT) పోలీసులు విచారించడం, ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతూ ఉండడం, మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) షెడ్యూలు విడుదల.. ఇలాంటి అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. వీటన్నింటిపై ముఖ్యమంత్రి తన సహచర మంత్రులతో చర్చించనున్నారు.

ఈ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యత :

సింగరేణి టెండర్ల అంశంలో రెండు వారాల్లో జరిగిన పరిణామాలన్నింటిపై సీఎం ఆరా తీయనున్నారు. రెండు వారాల పాటు విదేశాల్లో గడిపిన సీఎం నగరానికి వచ్చిన వెంటనే మంత్రులతో భేటీ కానుండడం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నది. ఒకవైపు సింగరేణి అంశంలో విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం, మరోవైపు గవర్నర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం ఈ వివాదాన్ని మరింత వేడెక్కించింది. టెండర్లను సింగరేణి రద్దు చేసినా విపక్షాలు తగ్గకపోవడంతో తదుపరి వ్యూహంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రణాళిక రూపొందించే అవకాశమున్నది. దీటుగా సమాధానం చెప్పడంపై ఫోకస్ పెట్టనున్నారు. దావోస్ పర్యటనకు ముందే సింగరేణి టెండర్ అంశం వెలుగులోకి వచ్చినా రెండు వారాల్లో అది అనేక మలుపులు తిరిగింది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించడం, కోల్ ఇండియా నుంచి ఆఫీసర్ల టీమ్ విచారణకు రావడం.. వీటన్నింటిపైనా ఈ సమావేశంలో లోతుగా చర్చ జరిగే అవకాశమున్నది.

సృజన్‌రెడ్డిపైనే విపక్షాల ఫోకస్.. :

సింగరేణి టెండర్లలో బావమరిదికి మేలు చేయడం కోసమే ముఖ్యమంత్రి రేవంత్ తెర వెనక ఉండి వ్యవహారం నడిపారని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు పదేపదే ఆరోపిస్తున్నారు. గతంలో సింగరేణిలో ఎన్నడూ లేని ‘సైట్ విజిట్ కంపల్సరీ’ కండిషన్ ఇప్పుడు హఠాత్తుగా తెరమీదకు రావడానికి కూడా సృజన్‌రెడ్డికి ఆ కాంట్రాక్టు కట్టబెట్టడం కోసమేనని ఆరోపించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టమైన వివరణ ఇచ్చినా ఇది చల్లారకపోవడంతో స్వయంగా సీఎం రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చే అవకాశమున్నది. రెండు వారాల వ్యవధిలో జరిగిన పరిణామాలన్నింటిపైనా ఆరా తీసి విపక్షాల విమర్శలకు ఘాటుగా సమాధానం ఇచ్చే అవకాశమున్నది. ముఖ్యమంత్రి లేని సమయంలో బీఆర్ఎస్ విరుచుకుపడిందని, మంత్రులు ఎందరు కౌంటర్ చేసినా వారి నోళ్ళు మూయించలేకపోయారని అభిప్రాయం కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తమైంది.

టెండర్లు రద్దు చేసినా ఆగని విమర్శలు :

ఒడిశాలోని నైని (Naini Coal) బొగ్గు బ్లాకుల్లో మైనింగ్ జరపడానికి సింగరేణి సంస్థ ఇచ్చిన టెండర్లలో గోల్‌మాల్ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti) ఆదేశాల మేరకు యాజమాన్యం ఆ టెండర్లను రద్దు చేసింది. ఇదే సమయంలో కోల్ ఇండియా సైతం ఈ ఆరోపణలను సీరియస్‌గా తీసుకుని అధికారుల బృందాన్ని సింగరేణి కార్పొరేట్ కార్యాలయానికి పంపింది. మరోవైపు కేంద్ర బొగ్గు మంత్రి కిషన్‌రెడ్డి సైతం దీనిపై మాట్లాడాల్సి వచ్చింది. టెండర్లను రద్దు చేసినా బీఆర్ఎస్ నేతలు మాత్రం గడచిన రెండేండ్లలో జరిగిన టెండర్లన్నింటినీ సమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గవర్నర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. టెండర్లు రద్దు చేశారంటేనే కుంభకోణం జరిగినట్లు కదా.. అంటూ బీఆర్ఎస్ నేలు విమర్శల దాడిని పెంచారు. ఈ వివాదానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంపై ఈ సమావేశం దృష్టి పెట్టే అవకాశమున్నది.

ఫోన్ ట్యాపింగ్, మున్సిపల్ ఎలక్షన్స్ సైతం :

ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేని సమయంలో మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) షెడ్యూలు విడుదల కావడంతో ఫిబ్రవరి 3 నుంచి ఆరు రోజుల పాటు జరిగే బహిరంగసభలపై సీఎం ఈ సమావేశంలో మంత్రులతో చర్చించనున్నారు. దీనికి తోడు ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తులో భాగంగా హరీశ్‌రావు, కేటీఆర్, సంతోష్‌లను సిట్ పోలీసులు విచారించడం, వారి నుంచి వచ్చిన సమాధానాలు తదితరాలపై కూడా సీఎం ఆరా తీసే అవకాశమున్నది. తదుపరి నోటీసులు కేసీఆర్‌కే అంటూ ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో సిట్ పోలీసుల దర్యాప్తుకు ప్రాధాన్యత చేకూరింది. ఈ అంశాలపైనా మంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) దిశానిర్దేశం చేసే అవకాశమున్నది.

Read Also: బీఆర్ఎస్‌కు ట్యాపింగ్ టెన్షన్.. విచారణలతో ప్రచారంపై ప్రభావం

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>