కలం, తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారంలో హరీశ్‌రావు, కేటీఆర్ (Harish Rao – KTR) ఎంక్వయిరీలకు వెళ్ళినప్పుడు పార్టీ శ్రేణులు స్పందించిన తీరుపై బీఆర్ఎస్‌లో చర్చ మొదలైంది. హరీశ్‌రావుకు సిట్ (SIT) పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచినప్పుడు ఆయన అనుచరులు, అభిమానులు విస్తృతంగా తరలి రావడం చర్చకు దారితీసింది. పార్టీ నుంచి ఎలాంటి పిలుపు లేకపోయినా భారీ స్థాయిలో తరలి రావడం హాట్ టాపిక్‌గా మారింది. రెండు రోజుల గ్యాప్ తర్వాత కేటీఆర్‌కు సైతం నోటీసులు జారీ చేయడంతో గంటల వ్యవధిలోనే పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి సర్క్యులర్ జారీ అయింది. అన్ని జిల్లాల్లోని పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, సీనియర్ నాయకులు, పార్టీ అధ్యక్షులు తరలి రావాల్సిందిగా పిలుపునిచ్చింది.
హరీశ్‌రావు విషయంలో ఇది లేదెందుకు? :
కేటీఆర్ విచారణ సందర్భంగా పార్టీ సెంట్రల్ ఆఫీసు నుంచి వెళ్ళిన ఆదేశాలు హరీశ్‌రావును పిలిచిన సమయంలో ఎందుకు లేదన్న సరికొత్త చర్చ శ్రేణుల్లో మొదలైంది. పార్టీ నుంచి ఎలాంటి పిలుపు లేకున్నా, ఆదేశాలు జారీ కాకున్నా హరీశ్‌రావు మీద అభిమానంతో తరలి వచ్చారని, కానీ కేటీఆర్ విషయంలో మాత్రం మొబిలైజ్ చేసుకోవాల్సి వచ్చిందన్నది ఆ చర్చల్లోని కీలకాంశం. కేటీఆర్ విషయంలో సెంట్రల్ ఆఫీస్ నుంచి జరిగిన కోఆర్డినేషన్‌తో రాత్రికి రాత్రే జిల్లాల నుంచి నేతలు సిటీకి చేరుకున్నారని, కానీ ఈ తరహా ప్రయత్నం హరీశ్ విషయంలో ఎందుకు పార్టీ నాయకత్వం తీసుకోలేదన్నది అనుచరుల, అభిమానుల అనుమానం. పార్టీలో ఇద్దరూ (Harish Rao – KTR) కీలక నేతలే అయినా వేర్వేరు రకాలుగా స్పందించడం చర్చలకు దారితీసింది.
హరీశ్‌రావు ప్రయారిటీకి నిదర్శనమా? :
కేసీఆర్ తర్వాత పార్టీ పగ్గాలు కేటీఆర్‌కే అంటూ పార్టీలో సాధారణ చర్చ ఎప్పుడో మొదలైంది. రెండోసారి పవర్‌లోకి వచ్చినప్పుడే కేటీఆర్‌ను సీఎం చేసే అవకాశాలపై ఊహాగానాలు వెలువడ్డాయి. పార్టీ నేతల ఫీడ్‌బ్యాక్‌ను పసిగట్టిన కేసీఆరే సీఎంగా కొనసాగాల్సి వచ్చిందన్న మాటలూ వినిపించాయి. ముఖ్యమంత్రి కేసీఆరే అయినా కేటీఆర్ ఒక డీఫ్యాక్టో సీఎంగా వ్యవహరించారన్న అపవాదు నెలకొన్నది. పార్టీలో సంస్థాగతంగా వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టడంతో పార్టీ పగ్గాలు ఎప్పటికైనా కేటీఆర్‌కే అనేది ఎస్టాబ్లిష్ అయింది. హరీశ్‌రావు రాజకీయ భవిష్యత్తుపై చర్చలు జరుగుతున్న సమయంలో స్వయంగా ఆయనే చొరవ తీసుకుని కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ విచారణ సందర్భంగా పార్టీ సెంట్రల్ ఆఫీస్ చేసిన అప్పీల్ హరీశ్‌రావును తక్కువ చేసి చూసిందన్న అభిప్రాయం ఆయన అభిమానుల్లో నెలకొనడానికి దారితీసింది.
Read Also: నరహంతక నియంత.. యూనస్‌పై షేక్ హసీనా ఫైర్
Follow Us On: X(Twitter)


