కలం, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహ్మద్ యూనస్‌పై పదవీచ్యుత ప్రధాని, భారత్‌లో తలదాచుకుంటున్న షేక్ హసీనా (Sheikh Hasina) తీవ్రంగా విరుచుకుపడ్డారు. మహ్మద్ యూనస్‌ను నరహంతక నియంతగా వర్ణించిన ఆమె.. బంగ్లాలో మధ్యంతర ప్రభుత్వాన్ని తొలగించి, తిరిగి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని ఆ దేశ ప్రజలకు విజ్ఙప్తి చేశారు. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన ‘ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ ఏషియా’ కార్యక్రమంలో.. షేక్ హసీనా మాట్లాడిన మాటల ఆడియోను వినిపించారు.
నోబెల్ బహుమతి గ్రహీత, ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వ సారథిగా ఉన్న మహ్మద్ యూనస్ (Muhammad Yunus) పై షేక్ హసీనా మండిపడ్డారు. ‘యూనస్ నరహంతక నియంత. వడ్డీ వ్యాపారి, దోపిడీదారుడు, అధికారం కోసం ఏమైనా చేసే అవినీతిపరుడు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దేశ శత్రువుగా మారిన విదేశీ శక్తులకు సేవలందిస్తున్న తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేయాలి. బంగ్లా విముక్తి పోరాటంలో వీరమరణం పొందిన అమరవీరుల రక్తంతో రాసిన రాజ్యాంగాన్ని కాపాడాలి. మన స్వాతంత్య్రాన్ని తిరిగి సాధించాలి. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి’ అని బంగ్లాదేశీయులకు ఆమె పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆమె.. తన పార్టీ అవామీ లీగ్ బంగ్లాదేశ్ (Bangladesh) లో రాజకీయ, మతపరమైన బహుళ సంస్కృతిని కాపాడేందుకు ఎల్లప్పుడూ రక్షణగా నిలిచిందన్నారు. దేశ చట్టాలు, రాజ్యాంగానికి కట్టుబడి పనిచేసిందన్నారు. యూనస్ పాలనలో దేశం దొంగలపాలయ్యిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. హింసకు ముగింపు పలకాలని, యూనస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, మైనారిటీలకు.. ముఖ్యంగా మహిళలు, బాలికలకు, బలహీన వర్గాల భద్రతకు హామీ కల్పించాలని, జర్నలిస్టులు, అవామీలీగ్ నేతలు, ప్రతిపక్ష నాయకులపై వేధింపులు ఆపాలని.. దీనికోసం ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని షేక్ హసీనా (Sheikh Hasina) విజ్ఞప్తి చేశారు.


