కలం, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్‌రావుపై డీజీపీకి కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ (Balmuri Venkat) ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం డీజీపీ శివధర్ రెడ్డిని కలసి రాతపూర్వకంగా ఫిర్యాదు అందించారు. ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసు విచారణ సందర్భంగా హరీశ్‌రావు, కేటీఆర్ అధికారులను బెదిరించేలా, భయభ్రాంతులకు గురిచేసేలా మాట్లాడారని బల్మూరి ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
కాగా, ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో రెండ్రోజుల కిందట హరీశ్‌రావును సిట్ అధికారులు విచారించారు. అలాగే నేడు కేటీఆర్‌ను విచారణకు పిలిచారు. ఈ క్రమంలో వీరు విచారణ అధికారులను భయపెట్టేలా మాట్లాడారని బల్మూరి ఫిర్యాదులో పేర్కొన్నారు. దర్యాప్తు, విచారణ క్రమంలో కేటీఆర్, హరీశ్‌రావు సిట్ బృందాన్ని, పోలీసుల తీరును ప్రశ్నిస్తూ అనేక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘అధికారులు ఎక్కడున్నా వదిలిపెట్టం.. సప్త సముద్రాలు దాటినా లాగుతాం.. రిటైర్మెంట్కు దగ్గరున్న అధికారులతో సిట్ బృందాన్ని ఏర్పాటు చేసినా, రెండేళ్ల తర్వాత వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్లను వదలదు.. అధికారులు సీఎం రేవంత్‌రెడ్డికి తొత్తుగా మారారు’ అంటూ ఘాటు హెచ్చరికలు సైతం జారీ చేశారు. ఈ క్రమంలో సిట్ అధికారులతోపాటు సీపీ సజ్జనార్నూ కేటీఆర్, హరీశ్‌రావు బెదిరించేలా మాట్లాడారంటూ డీజీపీ శివధర్ రెడ్డికి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.


