కలం, పెద్దపల్లి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మెప్పు పొందేందుకే బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్, మంత్రి వివేక్ వెంకటస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని పెద్దపల్లి ఎంపీ (Peddapalli MP) గడ్డం వంశీకృష్ణ (Gaddam Vamsi Krishna) తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలు తిరస్కరించిన తర్వాత కూడా బాల్క సుమన్ తన వైఖరి మార్చుకోకుండా, నిరాశతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. పదేళ్ల పాటు ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన ప్రజా తీర్పును గౌరవించి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.
గోడలు బద్దలు కొడతామని, బాంబులు వేస్తామని, పోలీసులపై దాడులు చేస్తామని మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ఎంపీ ప్రశ్నించారు. రాజకీయం కోసం యువతను రెచ్చగొట్టడం, తప్పుదోవ పట్టించడం మానుకోవాలని సూచించారు. గతంలో ఎంపీగా, ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు, ఇసుక-భూ మాఫియా ఆరోపణలు ఉన్నందుకే ప్రజలు ఆయనను ఇంటికి పరిమితం చేశారని గుర్తుచేశారు.
యువతకు ప్రపంచస్థాయి అవకాశాలే లక్ష్యం:
కేటీఆర్ పిల్లలు మాత్రమే మంచి పాఠశాలల్లో చదవాలా? తెలంగాణ పిల్లలు కూడా జర్మనీ, జపాన్, అమెరికా వంటి దేశాలకు వెళ్లి చదివేలా ప్రపంచస్థాయి విద్య, నైపుణ్యాలను మంత్రి వివేక్ వెంకటస్వామి అందిస్తున్నారని తెలిపారు. ఏడాదికి 25 వేల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. కేటీఆర్ మెప్పు కోసం విమర్శలు చేయడం మాని, మాటల్లో కాకుండా చేతల్లో ప్రజలకు సేవ చేసి చూపించాలని బాల్క సుమన్‌కు సూచించారు.

