కలం, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో జరిగిన కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) ధ్వజమెత్తారు. బాధ్యత వహించిన విద్యా శాఖ మంత్రి లోకేశ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో జరిగిన అక్రమాలు చూస్తే షాకింగ్ అనిపిస్తున్నాయని వివరించారు. ఈ అక్రమాలపై వెంటనే సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
అక్రమాలు బయటపడుతున్న కొన్ని మీడియా సంస్థల సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయిస్తోందన్నారు. దీనిపై మెటా వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. భావప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు అన్నారు. ఇందుకు విరుద్ధంగా ఏపీలో ప్రతిపక్షాలు, మీడియా, సామాజిక ఉద్యమకారుల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని జగన్ విమర్శించారు.
చంద్రబాబు భయపడుతున్నారు..
తాను గొప్పగా నిర్వహించానని చెప్పుకుంటున్న మెగా డీఎస్సీలో అక్రమాలు బయటపడుతున్న కొద్దీ చంద్రబాబు భయపడుతున్నారని జగన్ విమర్శించారు. లేకపోతే సీబీఐ విచారణకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. నిజంగా ఎలాంటి తప్పులు జరగకపోతే.. సోషల్ మీడియా పోస్టులను, అకౌంట్లను బ్లాక్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టెటె పాస్ కాకుండా, డీఎస్సీ పరీక్ష రాయకుండానే టీచర్ ఉద్యోగాలు ఇచ్చారని చంద్రబాబు ఎలా చెబుతున్నారని మండిపడ్డారు. స్పోర్ట్స్ కోటాలో జీవో జారీ చేసి తరువాత రద్దు చేశారన్నారు. కానీ, టీచర్ ఉద్యోగాలు అక్రమంగా పొందినవారిలో జీవో ఆధారంగా అపాయింట్ అయినవారేనని గుర్తు చేశారు. మెగా డీఎస్సీ పారదర్శకంగా జరిగిందని చంద్రబాబు భావిస్తే.. సీబీఐ విచారణకు అనుమతించి నిజాయితీ నిరూపించుకోవాలని జగన్ సవాల్ చేశారు.

