కలం, వరంగల్ బ్యూరో: కొండా సురేఖ–మురళి దంపతుల (Konda Family) రాజకీయ ప్రయాణంలో పార్టీలు మారాయి. అధినేతలు మారారు.. కానీ వారి రాజకీయ శైలి మాత్రం మారడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీలో ఉన్నప్పుడు తమకు, తమ అనుచరులకు పదవుల కోసం పట్టుబట్టడం.. డిమాండ్లను నెరవేర్చుకునేందుకు అధినాయకత్వంలో ఢీకొట్టడం.. పరిస్థితులు అనుకూలంగా లేకపోతే చివరికి పార్టీకి దూరం కావడం.. తిరిగి మరో పార్టీలో చేరడం.. ఇదే తరహా పరిణామాలు కొండా కుటుంబ రాజకీయ ప్రస్థానంలో పలుమార్లు కనిపించాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
వైఎస్సార్ నుంచి రేవంత్ వరకు..
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్‌లో కీలకంగా ఎదిగిన కొండా సురేఖకు ఎమ్మెల్యే, మంత్రి పదవులు లభించాయి. అదే సమయంలో మురళికి ఎమ్మెల్సీ పదవి కోసం కాంగ్రెస్ హైకమండ్పై కొండా కుటుంబం ఒత్తిడి తెచ్చిందన్న విమర్శలు వచ్చాయి. మంత్రి పదవి ఉన్నప్పటికీ, మరో పదవి కోసం పట్టుబట్టడం అప్పట్లో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
వైఎస్సార్ మరణంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో ఏర్పడిన రాజకీయ సంక్షోభం.. కొండా కుటుంబ రాజకీయ ప్రయాణాన్ని మలుపుతిప్పింది. కాంగ్రెస్‌ను వీడి జగన్ వెంట నడవడం.. వైసీపీలో చేరడం.. తెలంగాణలో జగన్‌కు అనుకూలంగా ఆందోళనలు చేయడం.. మానుకోట ఘటనలో చోటుచేసుకున్న హింసాత్మక పరిణామాలు.. ఆ తర్వాత జగన్‌తో విభేదాలు.. ఇలా వరుస పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఆ తర్వాత కొండా దంపతులు బీఆర్ఎస్ (అప్పట్లో టీఆర్ఎస్)లో చేరారు. హరీశ్‌రావు మధ్యవర్తిత్వంతో ఆ పార్టీలోకి వచ్చిన సురేఖ.. ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే తమ రాజకీయ ప్రత్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా బీఆర్ఎస్లో చేరడంతో కొండా కుటుంబం అసంతృప్తికి గురైందన్న ప్రచారం అప్పట్లో జరిగింది. బీఆర్ఎస్లోనూ అధిష్టానంతో విభేదాలు పెరగడంతో చివరకు ఆ పార్టీకి కూడా దూరమయ్యారు.
బీఆర్ఎస్లోని రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొండా కుటుంబం మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరింది. ఈసారి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో సురేఖ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. అయినప్పటికీ భర్త మురళికి ఎమ్మెల్సీ పదవి, కుమార్తె సుష్మితకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వానికి డిమాండ్లు పెట్టినట్టు ప్రచారం సాగింది. ఇంతలోనే సీఎం రేవంత్ రెడ్డిపై సుష్మిత అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాతి పరిణామాలతో సురేఖ మంత్రి పదవి కోల్పోవడం జరిగింది.
రాజకీయ ఆధిపత్యం!
కొండా కుటుంబం రాజకీయ ఆధిపత్యం కోసం పరితపిస్తుందనే విమర్శ ఎప్పటి నుంచో ఉన్నది. కొండా మురళి తీరు వివాదాస్పదమైన సందర్భాలు చాలా ఉన్నాయి. ఏ పార్టీలో ఉన్నా అధిష్టానంపై ఒత్తిడి తేవడం.. తమ రాజకీయ ప్రాధాన్యతను పెంచుకోవడం.. అధి సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయ మార్గం వెతుక్కోవడం.. ఇదే కొండా కుటుంబ తీరు అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇటీవల కాలంలో భద్రతా సిబ్బందితో కలిసి ప్రయాణించే దృశ్యాలను సినిమాటిక్ ఎలివేషన్‌తో చిత్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం కూడా చర్చకు దారితీసింది. అనుచరులు దీన్ని నాయకుడి ఇమేజ్‌గా చూస్తుండగా.. ప్రత్యర్థులు మాత్రం ఇది రాజకీయ ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నమని విమర్శిస్తున్నారు.

