కలం, నిజామాబాద్ బ్యూరో : కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రివర్గంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా (Nizamabad District)కు చోటు దక్కలేదు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి బెర్త్ ఖాయమని అంతా అనుకున్నా చివరకు మొండిచేయే అయింది. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చర్చకు వచ్చినప్పుడల్లా ఉమ్మడి జిల్లాకు ప్రాతినిథ్యం లేదనేది వస్తుంటుంది. ఈసారి కూడా మళ్లీ రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది.
మహేష్ గౌడ్.. మదన్ మోహన్ పేర్లు
మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మంత్రి పదవి ఆశించారు. ఆయనకు ఇదిగో అదిగో అంటూ ఊరించి చివరికి ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు కట్టబెట్టారు. మరోవైపు ఆయన రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు కావడంతో సామాజిక సమీకరణాలు అడ్డొచ్చాయి. ఇక తాజా సురేఖ బర్తరఫ్ తో మళ్లీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి కల్పిస్తారనే చర్చ జరుగుతోంది. అదే జరిగితే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పేరు ప్రధానంగా చర్చలోకి వస్తోంది. ఆయన గౌడ సామాజిక వర్గానికి చెందినవారు.
బీసీ కావడంతో పాటు పార్టీకి విధేయుడు. అందులోనూ పీసీసీ చీఫ్ కూడా. దీంతో ఉమ్మడి జిల్లా నుంచి రేసులో ఆయన ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన తర్వాత కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన అధినేత రాహుల్ స్థాయిలో ఉన్న సన్నిహిత సంబంధాలతో ఢిల్లీ స్థాయిలో గతంలో ప్రయత్నాలు చేశారు. ఈసారి కూడా అదే స్థాయిలో మళ్లీ లాబీయింగ్ ముమ్మరం చేసినట్టు సమాచారం.
పీసీసీ చీఫ్ కామెంట్స్ తో సస్పెన్స్!
ఉమ్మడి జిల్లా నుంచి ఈసారైనా అవకాశం ఇస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ప్రాతినిథ్యం ఇస్తే ప్రధానంగా మహేష్ గౌడ్కు ఎక్కువ అవకాశం ఉందనేది కేడర్ లో చర్చ జరుగుతోంది. అయితే.. కొండా సురేఖ స్థానం బీసీతోనే భర్తీ చేస్తే, అందులో తన లాంటి వారితో భర్తీ చేస్తామంటే అందుకు అంగీకరించనని ఇటీవల మహేష్ గౌడ్ ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ లెక్కన ఆయన మంత్రి పదవిపై ఆసక్తిగా ఉన్నారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. మొత్తానికి మంత్రివర్గ విస్తరణ జరిగితే ఎవరికి అవకాశం దక్కుతుంది. నిజామాబాద్ జిల్లాకు బెర్త్ ఖాయమవుతుందా..! అనేదుందుకు కొద్దిరోజులు ఆగాల్సిందే!

