హైకమాండ్‌లో రేవంత్ మాటే ఫైనల్? కొండా సురేఖ ఎపిసోడ్‌తో క్లారిటీ

కలం, తెలంగాణ బ్యూరో: మంత్రి కొండా సురేఖపై ఏఐసీసీ చర్యలు తీసుకునే విషయంలో సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) అభిప్రాయాలే నిర్ణయాలుగా మారాయి. ముఖ్యమంత్రికి ఐదారు నెలలుగా హైకమాండ్ అపాయింట్‌మెంటే ఇవ్వడం లేదని విపక్షాలు విమర్శలు చేస్తున్న టైమ్‌లో కొండా సురేఖపై తీసుకున్న యాక్షన్‌లో ఎవరి మాట చెల్లుబాటైందో, ఎవరి సిఫారసులు బుట్టదాఖలు అయ్యాయో కాంగ్రెస్ సీనియర్ నేతలకు, మంత్రులకు స్పష్టంగా అర్థమైంది. ప్రభుత్వంలోనే కాక పార్టీలోనూ సీఎం రేవంత్‌రెడ్డి మాటలే నడుస్తాయని మరోమారు స్పష్టమైంది.

ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే వేటు తప్పదనే మెసేజ్ వెళ్లింది. ఎంత స్థాయిలో ఉన్న నేతలైనా చర్యలు ఉంటాయనే సీరియస్ వార్నింగ్ సైతం ఇచ్చినట్లయింది. రాబోయే కాలమంతా పార్టీకి, ప్రభుత్వానికి కీలకమైనది కావడంతో ముఖ్యమంత్రికి పూర్తి స్వేచ్ఛ లభించిందనే మాటలు గాంధీభవన్‌లో వినిపిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణలోనూ ఛాయిస్, డెసిషన్ ముఖ్యమంత్రికే ఏఐసీసీ కట్టబెట్టినట్లు తెలిసింది.

ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇకపై మరో లెక్క

ఇప్పటివరకు ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరుకు, రానున్న రోజుల్లో వ్యవహరించబోయే పరిస్థితికి ఊహించనంత తేడా ఉంటుందని.. సీఎం రేవంత్‌రెడ్డి ఫంక్షనింగ్‌ను డిఫరెంట్ లుక్‌లో చూస్తారన్నది ఏఐసీసీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. మంత్రివర్గంలో ఉంటూనే అసమ్మతి రాగం వినిపించేవారికి, అగ్నికి ఆజ్యం పోసినట్లు వ్యవహరిస్తున్నవారికి కొండా సురేఖ విషయంలో ఏఐసీసీ తీసుకున్న నిర్ణయం ఊహించని షాక్ ఇచ్చింది.

పార్టీ లక్ష్మణరేఖ దాటితే వారి స్థాయితో, కులంతో సంబంధం లేకుండా సీరియస్ యాక్షన్ ఉంటుందనే హెచ్చరిక ఇవ్వడంతో రానున్న రోజుల్లో వివాదాస్పద కామెంట్లు చేసేవారు భయపడే పరిస్థితి నెలకొన్నది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఇంతకాలం నివురుగప్పిన నిప్పుగా గ్రూపు కట్టిన నేతల్లో ఇప్పుడు సరికొత్త ఆందోళన నెలకొన్నది. ముఖ్యమంత్రి పవర్‌ఫుల్ లీడర్‌గా మరోసారి ఎస్టాబ్లిష్ అయ్యారనే అవగాహనకు వచ్చి, ఇకపై ఆచితూచి వ్యవహరించాలనే ఆలోచనకు వచ్చారు.

మళ్లీ పవర్‌లోకి రావడమే లక్ష్యం

రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఆ బాధ్యతను సీఎం రేవంత్‌రెడ్డికే పార్టీ హైకమాండ్ అప్పజెప్పింది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఇప్పటివరకు ఏఐసీసీకి ఫిర్యాదులు చేసినవారందరికీ ఇప్పుడు గుబులు పట్టుకున్నది. కొండా సురేఖపై చర్యలు తీసుకోవద్దని, ముఖ్యమంత్రి ట్రాప్‌లో పడొద్దంటూ ఏఐసీసీ నేతకు ఓ సీనియర్ మంత్రి చెప్పినట్లు తాజా ఢిల్లీ టూర్ సందర్భంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం చివరకు ముఖ్యమంత్రికి కూడా చేరిందనేది అర్థమై.. ఇకపై ఏం జరుగుతుందో, సంబంధాలు ఎలా మారుతాయోననే ఆయన ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. కొండా సురేఖ సైతం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. మంత్రివర్గం నుంచి తనను తొలగించాలంటూ ఏఐసీసీ దగ్గర ముఖ్యమంత్రి పట్టుబడుతున్నారని, చివరకు అదే జరుగుతుందేమోనని కామెంట్ చేయడం గమనార్హం. రాష్ట్రంలో సీనియర్ నేతలున్నా, మంత్రులున్నా ముఖ్యమంత్రిదే ‘పైచేయి’ అనేది పార్టీ లీడర్లకు స్పష్టమవుతున్నది.

గొంతెత్తిన లీడర్లలో భయం

ఇంతకాలం ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా గొంతెత్తిన లీడర్లకు ఇప్పుడు సరికొత్త భయం పట్టుకున్నది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఏమవుతుందో.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పదవి వస్తుందో రాదో.. ఇలాంటి సందేహాలు మొదలయ్యాయి. ఇప్పటివరకు జరిగింది ఎలా ఉన్నా ఇకపై సీఎంకు సన్నిహితంగా ఉండడం మేలనే అభిప్రాయం కొందరిలో వ్యక్తమవుతున్నది. నిన్నమొన్నటి వరకు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రాబోయే రోజుల్లో నేనేంటో చూపిస్తా.. అంటూ ప్రగల్భాలు పలికిన లీడర్లు ఇక నుంచి సైలెంట్ ఉండడమో లేక సీఎంకు దగ్గరయ్యేలా ప్రయత్నాలు మొదలుపెట్టడమే బెటర్ అనే తీరులో వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి.

సీఎంతో పెట్టుకుంటే తిప్పలు తప్పవనే సాధారణ అభిప్రాయం పార్టీలో నెలకొన్నది. ఇప్పటివరకు స్వరం పెంచిన కొందరికి షోకాజ్ నోటీసులు రావొచ్చనే అనామానాలు ఉన్నా.. కొండా సురేఖపై యాక్షన్ నిర్ణయంతో కొన్ని రోజులు వెయిట్ చేసి, మరోసారి కామెంట్లు చేస్తే అప్పుడు ఇద్దామనే ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది. కొండా సురేఖపై తీసుకున్న యాక్షన్‌తో మొత్తం పార్టీలోనే ‘కంట్రోల్ మెకానిజం’ యాక్టివేట్ అయినట్లయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>