కలం, వనపర్తి: కలియుగ వైకుంఠాన్ని తలపించేలా వరపర్తి (Wanaparthy) జిల్లా పెద్దమందడి మండలం జగత్పల్లి కొండలయ్య గుట్ట (Kondalaiah Gutta) పై కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం శనివారం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. శ్రావణ మాసం చివరి శనివారం సందర్భంగా భక్తుల గోవింద నామస్మరణతో కొండలయ్య గుట్ట మార్మోగింది. జగత్పల్లి గ్రామంతో పాటు వనపర్తి మండలంలోని రాజనగరం, నాగవరం, రాజపేట, వనపర్తి పట్టణం తదితర ప్రాంతాల నుంచి వందలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
ఉదయం నుంచే భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. గుట్ట దిగువన కొలువైన అభయాంజనేయస్వామిని తొలుత దర్శించుకున్న భక్తులు అనంతరం కొండలయ్య గుట్టపైకి ‘ఏడుకొండలవాడా.. వెంకటరమణా.. గోవిందా.. గోవిందా..’ అంటూ నామస్మరణ చేస్తూ భక్తులు గుట్ట ఎక్కారు. భక్తి పారవశ్యంతో సాగిన ఈ యాత్రలో కొండ ఎక్కే అలసటను సైతం మరిచి స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని పులకించిపోయారు.
భక్తుల కోలాహలం, గోవింద నామస్మరణతో కొండలయ్య క్షేత్రం చిన్న తిరుమలను తలపించింది. శ్రావణ మాసంలోని శనివారం రోజున శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే పుణ్యఫలాలు లభిస్తాయని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, సహస్రనామార్చనలు నిర్వహించారు.
అన్నప్రసాద వితరణతో పునీతం
జగత్పల్లి గ్రామానికి చెందిన దాత గట్టు నాయుడు ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తి శ్రద్ధలతో సాగిన అన్నప్రసాద కార్యక్రమం క్షేత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెంటన్న యాదవ్, మాజీ సర్పంచులు మోహన్‌కుమార్ యాదవ్, నిరంజన్‌గౌడ్, నారాయణ యాదవ్, గ్రామ ప్రముఖులు బూరుగుపల్లి శ్రీనివాసరెడ్డి, జి. శ్రీనివాస యాదవ్, వార్డు సభ్యుడు మోజర్ల రాములు, కుమార్ యాదవ్, దత్తాత్రేయరెడ్డి, కృష్ణసాగర్, సురేష్‌చారి, బుచ్చన్న నాయుడు, వెంకటేష్‌నాయుడు, తుప్పుడ భాస్కర్ యాదవ్, తిరుపతి నాయుడు, కృష్ణుడు, చంద్రుడు తదితరులు పాల్గొన్నారు.

