కలం, వలిగొండ: భూగర్భ జలాల పెరుగుదలకు ఫామ్ పాండ్స్ (Farm Ponds) ఎంతగానో తోడ్పడతాయని డిఆర్డిఓ నాగిరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పహిల్వాన్ పూర్ గ్రామంలో బద్దం జోష్ణ రెడ్డి వ్యవసాయ భూమిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన ఫామ్ పాండ్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఫామ్ పాండ్ నిర్మాణ పనుల పురోగతి, పనుల నాణ్యత, కూలీలకు కల్పిస్తున్న ఉపాధి తదితర అంశాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల్లో పాల్గొంటున్న కూలీలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, పనికి సంబంధించిన వివరాలను అడిగి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీవో పరశురాములు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ విక్రమ్, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాసు, ఫీల్డ్ అసిస్టెంట్ విజయ, కార్యదర్శి స్నేహలత పాల్గొన్నారు.

