కలం, వరంగల్ బ్యూరో: “ఎవరి వెంట నడవాలి ? ఎవరిని ఆశ్రయించాలి ? టికెట్ కోసం ఎవరి తలుపు తట్టాలి? తమ రాజకీయ భవిష్యత్తుకు ఎవరి అండ ఉండబోతోంది? మంత్రి పదవి నుంచి కొండా సురేఖ బర్తరఫ్ తర్వాత వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ (Warangal Congress) కేడర్ మదిని ఇప్పుడు ఇవే ప్రశ్నలు తొలుస్తున్నాయి. ఇన్నాళ్లూ సురేఖ వెంట నడుస్తున్న నేతలు, కార్యకర్తల పరిస్థితి ఒక్కసారిగా కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మరింత గందరగోళానికి దారితీసినట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
రెండు వర్గాలు.. మధ్యలో కేడర్
కొన్నాళ్లుగా వరంగల్ తూర్పు కాంగ్రెస్‌లో కొండా సురేఖ, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య వర్గాల మధ్య రాజకీయ విభేదాలు నెలకొన్నాయి. తాజాగా బహిరంగ విమర్శలు, సవాళ్ల స్థాయికి చేరడంతో క్షేత్రస్థాయి నేతలు, కార్యకర్తలకు ఎటువైపు ఉండాలో తేల్చుకోలేని అయోమయ పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు సురేఖ నాయకత్వాన్ని నమ్ముకుని ముందుకు సాగినవారిలో కొందరు తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్టు, మరోవైపు సారయ్య శిబిరానికి దగ్గరవ్వాలని భావిస్తున్న వారికి కూడా పలు సందేహాలు వెంటాడుతున్నట్లు సమాచారం.
సారయ్యను ఆశ్రయిస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సురేఖతో భవిష్యత్తులో రాజకీయంగా ఇబ్బందులు వస్తాయా? అనే ప్రశ్న ఉండగా.. ఆమె వెంట ఉంటే ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితుల్లో తమకు వచ్చే అవకాశాలేంటి? అనే ఆలోచన మరికొందరిలో ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీంతో చాలామంది నేతలు ప్రస్తుతం ‘ వేచి చూద్దాం.. పరిస్థితి ఎలా మారుతుందో ఆగుదాం’ అనే ధోరణిలో ఉన్నట్లు సమాచారం.
రాబోయే ఎన్నికలే అసలు టెన్షన్
కాంగ్రెస్ కేడర్ అయోమయానికి ప్రధాన కారణం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలేననే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. గ్రామ, మండల, మున్సిపల్ స్థాయిలో టికెట్లు ఆశించే నేతలు ఇప్పటికే తమ రాజకీయ లెక్కలు వేసుకునే పనిలో పడ్డారు. అభ్యర్థుల ఎంపికపై ఎవరి ప్రభావం ఉంటుందనేది ఇప్పుడు ఆశావహులకు కూడా అంతుచిక్కడం లేదు. ఇన్నాళ్లు సురేఖ వర్గంలోని నేతలు తమకు స్థానిక ఎన్నికల్లో చాన్స్ వస్తుందనే నమ్మకంతో ముందుకు సాగారు.
అయి తే ఆమె మంత్రి పదవి కోల్పోవడంతో రాజకీయ సమీకరణాలు మారుతాయా? పార్టీ అధిష్టానం కొత్త సమీకరణాలకు ప్రాధాన్యం ఇస్తుందా? స్థానిక టికెట్లపై సురేఖ మాటకు ఎంతవరకు ప్రాధాన్యం ఉంటుంది? అనే ప్రశ్నలు వస్తున్నాయి. మరోవైపు సారయ్య వర్గానికి చెందిన ఆశావహులు కూడా తమ ప్రయత్నాల్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో టికెట్ ఆశించే నేతలు రెండు వర్గాలతోనూ సంబంధాలు కొనసాగిస్తూ, ఏ వైపు నుంచి చాన్స్ వస్తే ఆ వైపు వెళ్లేలా జాగ్రత్త పడుతున్నారనే చర్చ జరుగుతోంది.
సంచలనంగా ఎమ్మెల్సీ కామెంట్స్
ఇక పార్టీలో రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ఎమ్మెల్సీ సారయ్య ఇప్పటికే కొండా సురేఖపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ఆయన ప్రకటించడం వరంగల్ తూర్పు లో సంచలనంగా మారింది. ఇప్పటికే వర్గపోరు మరోసారి బహిరంగ చర్చకు వచ్చింది. ఒకవైపు సురేఖ రాజకీయంగా తన పట్టును కొనసాగించాలని చూస్తుండగా, మరోవైపు ప్రత్యర్థి వర్గం ఆమెపై రాజకీయ ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆ రెండు చోట్ల తగ్గిన సందడి
పార్టీ కేడర్‌లోని అయోమయం నియోజకవర్గంలోనూ కనిపిస్తుంది. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో సందడిగా కనిపించే ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు, హనుమకొండ రాంనగర్‌లోని కొండా సురేఖ ఇంటి వద్ద గత రెండు రోజులుగా జనసందడి తగ్గింది. అయితే దీన్నీ రాజకీయంగా దూరం పెరిగిన సంకేతంగా చూడాలా? లేక తాజా పరిణామాల నేపథ్యంలో నేతలు, కార్యకర్తలు వేచి చూసే ధోరణిలో ఉన్నారా? అనే విషయంలో స్పష్టత లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్య నేతలు కూడా బహిరంగంగా స్పందించకుండా మౌనం పాటిస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

