ఫైర్ స్టేషన్ ఇంకెప్పుడు.. సంగారెడ్డి జిల్లా వాసుల ఎదురుచూపులు

కలం, మెదక్ బ్యూరో: అక్కడ వందలాది కంపెనీలు, వేల సంఖ్యలో కార్మికులు ఆ ప్రాంతం ఓ పారిశ్రామిక‌వాడ ఏ క్షణంలోనైనా అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్న కంపెనీలన్నీ రసాయనాలు వినియోగించేవి కావడంతో కార్మికలోకం బిక్కు బిక్కు మంటూ గడుపుతు ఉంటుంది. ఆ ప్రాంతమే సంగారెడ్డి (Sangareddy) జిల్లాలోని పారిశ్రామికవాడ. కానీ అక్కడ ఒక ఫైర్ స్టేషన్ అందుబాటులో లేదు. కార్మికుల ప్రాణాల‌కు మాత్రం క‌నీస‌ భ‌ద్ర‌త క‌రువైంది. అత్యంత ప్ర‌మాద‌కార ప‌రిస్ధితులల్లో రియాక్ట‌ర్లు మ‌ధ్య వారు నిత్యం చస్తూ బతుకుతున్నారు. వేసవి వచ్చిందంటే చాలు..  అక్కడ ప్రమాదాలు జరగడం అత్యంత సహజం. ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి విధులు నిర్వ‌హించ‌ల్సిన ప‌రిస్దితి. ప్ర‌తిఏడు ఆగ్ని ప్ర‌మాద‌లు జ‌రుగుతున్నా నేటికి అక్కడ ఓ అగ్నిమాపక కేంద్రం లేకపోవడం ఆశ్చర్యంగా ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు.

నాలుగువందలకు పైగా కంపెనీలు

సంగారెడ్డి జిల్లాలోని ఐడీఏ బొల్లారం, బొంత‌ప‌ల్లి, గ‌డ్డ‌పోతారం, ఖాజీప‌ల్లిలోని పారిశ్రామ‌క వాడ‌ల్లో సుమారు 400పైగా వివిధ ర‌కాల ప‌రిశ్ర‌మ‌లు ఉన్నాయి. ఇక్క‌డి ఇండ‌స్ట్రియ‌ల్ పార్కుల్లో ఉన్నవి ఫార్మా, ర‌సాయ‌న ప‌రిశ్ర‌మ‌లే. ఇక్క‌డి ఫార్మాప‌రిశ్ర‌మ‌ల్లో వివిధ ర‌కాల‌ డ్ర‌గ్స్ భారీసంఖ్యలో ఉత్ప‌త్తి చేస్తుంటారు. దీంతో ప్ర‌తి ప‌రిశ్ర‌మ‌లోను రియాక్టర్లు, బాయిల‌ర్స్ ఉంటాయి. 1980 నుంచి ద‌శ‌ల‌వారిగా ఈ ప్రాంతంలో ప‌రిశ్ర‌మ‌ల విస్త‌ర‌ణ జరుగుతోంది. బ‌ల్క్ డ్ర‌గ్స్, రసాయన పదార్థాలు, సాల్వెంట్లు, ఇండస్ట్రియల్ కెమికల్స్ తయారీ కూడా జరుగుతోంది. ఇక్క‌డి కంపెనీల్లో వేలసంఖ్యలో కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ముఖ్యంగా ప్రొడ‌క్ష‌న్ విభాగంలో కార్మికులు అత్యం ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తుంటారు.

ఫైర్ ఇంజ‌న్ వ‌చ్చే లోపే అంతా బూడిదే…

నలబై ఏండ్లుగా ఐడీఏ బొల్లారం, బొంత‌ప‌ల్లి, గ‌డ్డ‌పోతారం, ఖాజీప‌ల్లిలోని పారిశ్రామికవాడ‌ల్లో వంద‌లాది ప‌రిశ్ర‌మ‌లు ఉన్నాయి. కానీ ఒక్క‌ ఫైర్ స్టేష‌న్ కుడా లేదు. ఈ పారిశ్రామిక వాడ‌ల్లో ఆగ్నిప్రమాదాలు జరిగితే మంట‌ల‌ను అదుపుచేయ‌డానికి ప‌టాన్‌చెరు, న‌ర్సాపూర్, జీడిమెట్ల నుంచి ఫైర్ ఇంజిన్లు రావాల్సిందే. అక్క‌డి నుండి ఘటనా స్థలానికి రావాలంటే దాదాపుగా 45 నిముషాల‌కుపైగా స‌మ‌యం ప‌డుతుంది. ఈ 45 నిమిషాల్లో అగ్ని కీలలు విస్త‌రించి.. ప‌రిశ్ర‌మ ఖాళీ బూడిద అయిపోతుంది. ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. రియాక్టర్లు పేలిపొయిన సంద‌ర్భంలో మంట‌లు ప‌క్క‌నే ఉన్న ఇత‌ర కంపెనీల‌కు వ్యాపిస్తున్నాయి. ఇలా మంట‌ల‌ను స‌కాలంలో అదుపులోకి తీసుకురాక‌పొవ‌డంతో అస్తిన‌ష్టం న‌ష్టం బాగా పెరిగి ప‌రిశ్ర‌మలు అర్ధికంగా తీవ్రంగా న‌ష్ట‌పోతున్నాయి. 40 యేళ్ల‌లో వంద‌ల సంఖ్య‌లో ఆగ్ని ప్రమాదాలు జరిగి భారీగా కార్మికులు చ‌నిపొతున్నప్ప‌టికీ ఫైర్ స్టేష‌న్ ఏర్పాటు చేయ‌క‌పోవడం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్ప‌టి వ‌ర‌కు రెండు ప‌రిశ్ర‌మ‌ల్లో ఆగ్ని ప్రమాదాలు  సంభ‌వించాయి. ఫైర్ స్టేషన్ దగ్గర్లో ఉంటే ప్రమాద తీవ్రత తగ్గేదన్న చర్చ జరుగుతోంది.

అగ్నిమాపకశాఖ తీరుపై విమర్శలు

ఆగ్నిమాప‌కశాఖ కేవ‌లం భ‌ద్ర‌తా వారోత్స‌వాల‌ను నిర్వ‌హించ‌డం త‌ప్ప ప్రమాదాలను అరికట్టలేకపోతున్నదన్న విమర్శలు వస్తున్నాయి. తూతూ మంత్రంగా పరిశ్రమల్లో తనిఖీలు చేసి ఎన్‌వోసీలను జారీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కేవ‌లం ప్రమాదాలు జ‌రిగిన త‌ర్వాత మాత్ర‌మే స్పందిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. వేసవిలో ప్ర‌తి ఏడు ప్రమాదాలు జరుగుతున్నా ప్ర‌మాద‌ల నివార‌ణ‌కు స్ప‌ష్ట‌మైన కార్య‌చ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను అమ‌లు చేయ‌డం లేదని కార్మికులు అంటున్నారు. మాక్‌డ్రిల్స్‌ ఎక్కువ‌గా నిర్వ‌హించి ప్రమాదాల గురించి అవగాహన కల్పిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇత‌ర శాఖ‌లతో స‌మ‌న్వ‌యం చేసుకొని కాలంచెల్లిన యంత్రాలు, రియాక్టర్లు మారిస్తే ప్రమాద తీవ్రత కొంతవరకు తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ప్ర‌తిపాద‌న‌ల‌ను సిద్దంచేసి ఫైర్ స్టేష‌న్ ఏర్పాటు చేయ‌డంలో ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాల్సి ఉంది.

ప్రభుత్వాలు మారినా ప్రయోజనం శూన్యం

ప్ర‌భుత్వాలు మారినా, పాలకులు చేంజ్ అయినా చొరవ తీసుకొనే వారు కరువయ్యారు. కంపెనీలు కూడా లాభాల మీద ధ్యాస ఫైర్ స్టేషన్ పెట్టడం లేదని తెలుస్తోంది. కంపెనీ యజమానులంతా ఒక్కతాటిమీదకు వచ్చి తమకు ఫైర్ స్టేషన్ కావాల్సిందేనని పట్టుబడితే ప్రభుత్వాలు స్పందించే చాన్స్ ఉంది. తమ కంపెనీల నిర్మాణాల కోసం ప్రభుత్వాల నుంచి భారీగా భూములు తీసుకొనే కంపెనీలు తమ భద్రత విషయంలో మాత్రం చొరవ తీసుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. నల‌బై యేళ్లుగా నిత్యం వేలాదిమంది కార్మికులు ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ప‌నులు చేస్తున్నారు. ప్రమాదాలు నిత్యం జ‌రుగుతుండ‌టంతో స్ధానిక ప్ర‌జ‌లు కుడా తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఆగ్ని ప్ర‌మాదం కార‌ణంగా ద‌ట్టంగా పొగ వ్యాపించ‌డంతో రెండు మూడు రోజులు చుట్టుప‌క్క‌ల ప్రాంతాల ప్ర‌జ‌లు శ్వాస తీసుకొవ‌డం ఇబ్బందిగా మారుతుంది. ఇప్పటికైనా ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు, యాజ‌మాన్య‌లు మేలుకొని ఫైర్ స్టేషన్ నిర్మాణం కోసం పూనుకోవాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>