కలం, వెబ్ డెస్క్: తమిళనాడు సీఎం విజయ్ (CM Vijay) తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలు ఫీజుల పేరిట తల్లిదండ్రులను దోచుకుంటున్నట్లు అనేక ఫిర్యాదులు రావడంతో పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఫీజుల నియంత్రణ కమిటీ సిఫార్సుల మేరకు ఏ తరగతికి ఎంతెంత ఫీజులు తీసుకోవాలో చెబుతూ ఒక ఛార్ట్‌ను రూపొందించారు. ఈ బోర్డులను ప్రతీ పాఠశాలలో ఏర్పాటు చేయాలని విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. అంతకుమించి అధికంగా వసూళ్లు చేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
అవసరమైతే పాఠశాల గుర్తింపు రద్దు..
ఫీజుల నియంత్రణ విషయంలో విజయ్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. ప్రతి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం అడ్మిషన్ కంటే ముందే ఫీజులపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. తమ అధికారిక వెబ్‌సైట్లు, దరఖాస్తు ఫారాల్లో ప్రభుత్వం విధించిన ఫీజుల వివరాలను తప్పనిసరిగా పొందుపరచాలి. పరిమితి దాటి తీసుకుంటే విద్యా శాఖ విచారణ చేసి గుర్తింపు రద్దు చేస్తుంది. ఇక డొనేషన్ల పేరిట ఇష్టారాజ్యంగా ఫీజులు వడ్డించినా.. యాజమాన్యాలకు ఇబ్బందులు తప్పవు. విద్యా వ్యవస్థలో పారదర్శకతతో పాటు పేద, మధ్య తరగతి కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించే ఉద్దేశంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

