Mobile Popup Ad
Mobile Popup Ad

తగ్గిన సాగు.. రాష్ట్రంలో కూరగాయల షార్టేజ్ ముప్పు!

కలం, తెలంగాణ బ్యూరో: ఒకప్పుడు మార్కెట్ కు పోతే వంద రూపాయలు ఇచ్చి పది ఇరవై రకాల కూరగాయలు తెచ్చుకునేది. ఇప్పుడు ఆ వంద రూపాయలకు రెండు మూడు రకాలు వస్తే ఎక్కువ. కొత్తిమీర కూడా ముత్తెమంత కట్ట పది పదిహేను రూపాయలకు తక్కువ లేదు. వంకాయలు, బీరకాయలు, టమాటాల రేట్లు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. అల్లం, ఎల్లిగడ్డ రేట్లకు లెక్కలేదు. రాబోయే కాలంలో కూరగాయల ధరలు మరింత పెరగనున్నాయి. అసలు సప్లయ్ కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇందుకు ప్రధాన కారణం రాష్ట్రంలో కూరగాయల సాగు భారీగా పడిపోవడమే (Vegetable Crisis). 12ఏండ్ల కింద 5.5 లక్షల ఎకరాల్లో సాగైన కూరగాయలు ఇప్పుడు కేవలం 50 వేల ఎకరాల్లోనే సాగవుతున్నాయి.

ఏటా తెలంగాణ వాడే కూరగాయలు 56 లక్షల టన్నులు. ఇక్కడ పండిస్తున్నది మాత్రం 10 లక్షల టన్నుల లోపే. అంటే మిగతా 46 లక్షల టన్నులు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. కొత్తమీర కూడా గుజరాత్ నుంచి తెచ్చుకునే దుస్థితి.  ఎల్నినో ప్రభావం ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్రంగా ఉంటుందని, దాంతో అక్కడ కూరగాయల  దిగుబడి తగ్గి మనకు సప్లయ్ సరిగ్గా కాదని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఫలితంగా రేట్లు కూడా భారీగా పెరగొచ్చని చెబుతున్నాయి. దీనికి పరిష్కారం లోకల్ గానే కూరగాయల సాగును పెంచాలని వ్యవసాయ శాఖ సూచిస్తున్నది.

సొంత రాష్ట్రం ఏర్పడితే మన నీళ్లు, మన నిధులు, మన కొలువులు మనకే దక్కుతాయని తెలంగాణ ప్రజలు భావించారు. మన కూరగాయలను మనమే పండించుకోవచ్చు.. ఇతర రాష్ట్రాల మీద ఆధారపడొద్దు.. స్వయంసమృద్ధిగా ఉండొచ్చు.. అనే అంశంలో రైతులూ ఆలోచించలేదు.. పార్టీల నేతలు, పాలకులూ అవగాహన కలిపించలేదు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే కూరగాయలు, పండ్లు, పప్పుదినుసులు నిత్యం దిగుమతి అయ్యేవి. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి టమాటా, పచ్చిమిర్చి, వివిధ రకాల ఆకుకూరలు, ఉల్లిగడ్డ మొదలు ఆలుగడ్డ వరకు ప్రతీరోజు లారీల్లో వచ్చి పడేవి. ఇప్పుడు పన్నెండేండ్ల తర్వాత పరిస్థితి మరింత తీవ్రమైంది. వరి, మొక్కజొన్న, ఆయిల్ పామ్ మినహా మిగిలిన అన్నింటికీ ఇతర రాష్ట్రాలే దిక్కయ్యాయి. తెలంగాణ ఏర్పడిన కొత్తలో రాష్ట్రంలో ఐదున్నర లక్షల ఎకరాల్లో కూరగాయల సాగు ఉంటే ఇప్పుడు అది కేవలం 50 వేల ఎకరాలకు పరిమితమైంది. స్వయంసమృద్ధి సాధించడానికి బదులు ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తున్నది.

కొత్తిమీర సైతం గుజరాత్ నుంచే!

టమాటాలు, దొండకాయలు, బెండకాయలు లాంటి కూరగాయలన్నీ ఏపీలోని మదనపల్లి, చింతపల్లి నుంచి వస్తున్నవే. క్యారెట్, కాలీఫ్లవర్, క్యాబేజీ, బీన్స్, కాప్సికమ్.. ఇవన్నీ కర్నాటక నుంచి వస్తున్నాయి. ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, అల్లం, వెల్లుల్లి.. ఇలాంటివన్నీ మహారాష్ట్ర నుంచి వస్తున్నాయి. ఇలా ఒక్కో రాష్ట్రం నుంచి ఒక్కో రకమైన కూరగాయలు, ఆకుకూరలు, ప్రతీరోజూ వంటింట్లో వాడేవి దిగుమతి చేసుకోక తప్పడంలేదు. రాష్ట్ర వ్యవసాయ కమిషన్‌ సభ్యుడొకరు ఈ దయనీయ పరిస్థితిని వివరిస్తూ.. కొత్తిమీరను సైతం గుజరాత్ నుంచి తెప్పించుకుంటున్నామని, రాబోయే రోజుల్లో ఎల్‌నినో ప్రభావం ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్రంగా ఉంటుందని, ఆ కొత్తిమీర సప్లై ఆగిపోతే దాని తీవ్రత (Vegetable Crisis) ఏ స్థాయిలో ఉంటుందో తెలుస్తుందన్నారు. గడచిన పదేండ్లలో వరి, మొక్కజొన్న, పత్తి, మిరప తప్ప మిగిలిన పంటల సాగు నామమాత్రంగా మారిందన్నారు. ఒకప్పుడు హైదరాబాద్ శివారు ప్రాంతాలన్నీ ద్రాక్ష తోటలతో కనిపించేవని, ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకుంటున్నామని గుర్తుచేశారు.

వరి మూడు రెట్లు పెరిగి.. :

– తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో వరి సాగు దాదాపు 50 లక్షల ఎకరాలు ఉంటే ఇప్పుడు కోటింబావు ఎకరాలకు పెరిగింది. కూరగాయల సాగు ఐదున్నర లక్షల నుంచి 50 వేల ఎకరాలకు తగ్గింది (Vegetable Crisis).
– నాణ్యమైన పసుపు అనగానే ఠక్కున గుర్తుకొచ్చే నిజామాబాద్‌లో పసుపు బోర్డు పెట్టాలని కొట్లాడినా చివరకు దాని సాగు లక్షన్నర ఎకరాల నుంచి 42 వేల ఎకరాలకు పడిపోయింది.
– లక్ష ఎకరాల్లో సాగైన చెరకు ప్రస్తుతం రెండు వేర ఎకరాలకు కుదించుకుపోయింది.
– పండ్ల తోటలు 9 లక్షల ఎకరాల్లో సాగవుతుంటే ఇప్పుడు అది సగానికి పడిపోయి నాలుగున్నర లక్షలకు పరిమితమైంది.
– పూల తోటలు 17 వేల ఎకరాల నుంచి ఆరు వేలకు తగ్గింది.
– అగ్రికల్చర్ మీద గత ప్రభుత్వం పెట్టిన శ్రద్ధను హార్టికల్చర్ మీద పెట్టలేదని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. గ్రీన్ హౌజ్, పాలీ హౌజ్ ఫార్మింగ్ అంటూ గొప్పగా చెప్పినా అవి అర్ధంతరంగా ఆగిపోయాయి. వరి దిగుబడి పెరిగినందుకు రాష్ట్ర సర్కారు సంతోష పడుతున్నా దాని వెన్నంటి కూరగాయలు, పండ్ల దిగుమతి భవిష్యత్తులో ప్రమాదకరమనే ఆలోచనకు వచ్చింది.

కూరగాయలు సాగు పెంచకపోతే తిప్పలే!

కూరగాయల సాగు ఎందుకు తగ్గిపోయిందో, సేద్యంలో ఎదురవుతున్న ఇబ్బందులేంటో, రైతులు ఎందుకు ఆసక్తి చూపడంలేదో, గిట్టుబాటు ధర సహా మార్కెటింగ్ సౌకర్యాలపై వ్యవసాయ కమిషన్ అధ్యయనం చేసింది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి సాగు, ప్రభుత్వ ప్రోత్సాహం తదితరాలపై చర్చించింది. రాష్ట్రంలో కూరగాయల సాగును పెంచాలన్న ఉద్దేశంతో ప్రయోగాత్మకంగా రైతులకు ప్రోత్సాహాలను అందిస్తూ యాచారం మండలంలోని మూడు గ్రామాలను ఎంపిక చేసింది. ఒక్కో ఎకరానికి రూ. 9,800 చొప్పున ఇన్సెంటివ్ ప్రకటించి 350 ఎకరాల్లో రైతుల్ని సంసిద్ధం చేసింది. గంట మల్లయ్యగూడెం, చౌదరిపల్లి, మొండిగౌరెల్లి అనే ఈ మూడు గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు ఆశించినదానికంటే మంచి ఫలితాలు ఇచ్చాయని కమిషన్ సభ్యుడు పేర్కొన్నారు. రాబోయే రెండేండ్లలో కనీసం పది లక్షల ఎకరాల్లో కూరగాయల సాగు వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కానీ, రైతులు ఎలా స్పందిస్తారో చూడాలి. కూరగాయల సాగు పెంచకపోతే.. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో వాటికి తిప్పలు తప్పవు. డిమాండ్కు తగ్గట్టు సప్లయ్ లేకపోతే  రేట్లూ మరింత పెరిగే అవకాశమూ ఉంటుంది.

వన్ డిస్ట్రిక్ట్ – వన్ ప్రొడక్ట్ పాలసీ

ప్రతీ జిల్లాకు ఉన్న ప్రత్యేక భౌగోళిక పరిస్థితులు, నేల స్వభావం, వాతావరణానికి అనుగుణంగా ఒక ప్రధాన పంటను ఎంచుకునేలా ఆలోచనలు జరుగుతున్నాయి. నిజామాబాద్‌లో పసుపు, చెరకు, వరంగల్ జిల్లాలో మిర్చి, ఖమ్మం జిల్లాలో మిర్చితో పాటు మామిడి, రంగారెడ్డి – వికారాబాద్ – సిద్దిపేట్ జిల్లాల్లో కూరగాయలు.. ఇలాంటి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. కూరగాయలు, పండ్ల సాగులో కోతులు, అడవి పందుల నుంచి వచ్చే ఇబ్బందులతో పాటు విత్తనాల కొరత, మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడం, దళారీల బెడద.. ఇవన్నీ ప్రతిబంధకాలుగా ఉన్నాయి. ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుకు భరోసా కల్పించాలన్న ప్రపోజల్స్ సిద్ధమవుతున్నాయి. ప్రతీ జిల్లాను ఒక పంటను ఖరారు చేసి రైతుల్ని ప్రోత్సహించడంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. కూరగాయల సాగు కోసం ప్రత్యేక క్లస్టర్‌లను ఏర్పాటు చేయడంతో పాటు ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్లను ఎంకరేజ్ చేయడంపై వ్యవసాయ కమిషన్ కసరత్తు చేస్తున్నది.

రాష్ట్రం ఏర్పడే నాటికి ఆయా పంటల సాగు, ప్రస్తుత విస్తీర్ణం (ఎకరాల్లో)
                                   2014                     2026
వరి                              49,28,000             1,27,03,000
చెరకు                          95,348                  2,026
పండ్ల తోటలు                 9,11,200               4,48,960
కూరగాయలు                 5,52,352                1,02,698
పూలతోటలు                  17,220                   6,248
పసుపు                         1,52,445                42,246
ఆయిల్ సీడ్స్                12,41,845               7,13,572
పప్పుధాన్యాలు               10,20,418               8,83,710
ఉద్యానపంటలు            19,82,270                12,46,032
Follow Us On: Sharechat
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>