Mobile Popup Ad
Mobile Popup Ad

ఇకపై బైక్ హ్యాండిల్ వదిలేస్తే దబిడి దిబిడే

కలం, స్పెషల్​ డెస్క్​ : చేతులు వదిలేసి బైక్ నడుపుతున్నారా?.. పలువురి దృష్టి పడేలా విన్యాసాలు చేస్తున్నారా? ఒక చేత్తో ఫోన్లో మాట్లాడుతూ.. మరో చేత్తో డ్రైవ్ చేస్తున్నారా?! ఇలాంటి తిక్క చేష్టలకు ఇక బ్రేకులు పడబోతున్నాయి. రెండు చేతులూ హ్యాండిల్ బార్ మీద ఉంటేనే బైక్ నడిచే టెక్నాలజీ రాబోతున్నది. హ్యాండిల్ మీద నుంచి ఒక్క చేయి తీసేసినా ఆటోమేటిక్‌గా స్పీడ్ తగ్గిపోతుంది. ఆ తర్వాత బైక్ మొత్తానికే రన్నింగ్లో ఆగిపోతుంది. అందుకే బండి నడిపేటప్పుడు సాహసాలు చేస్తామంటే ఇక నడ్వద్. యూత్ వెర్రి వేషాలకు ప్రత్యేక సెన్సార్‌ల (Safety Sensors) తో బైక్ కంపెనీలు చెక్ పెట్టబోతున్నాయి. సెల్ఫ్ డిసిప్లైన్ లేకపోవడంతో ఇలాంటి నిర్బంధం తప్పనిసరి అవుతున్నది.

దేశవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా బైక్‌లే ఉంటున్నాయి. యాక్సిడెంట్స్లో 44 శాతం మంది మరణాలకు కేవలం టూవీలర్స్ నిర్లక్ష్యపు డ్రైవింగే కారణమవుతున్నది. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి. రాష్ డ్రైవింగ్‌, సెల్ఫోన్ డ్రైవింగ్తో కేవలం నడిపేవారే కాక ఇతర వాహనదారులు, పాదచారులు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. బైక్ నడిపేటప్పుడు కంట్రోల్ ఉండడంతో పాటు క్రమశిక్షణ కూడా అవసరమని, ఇవి లోపించిన కారణంగానే టెక్నాలజీతో బ్రేకులు వేయాలనే నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తున్నదని కేంద్ర రవాణా మంత్రిత్వశాఖ అధికారులు సూచనప్రాయంగా తెలిపారు. త్వరలోనే ‘హ్యాండ్స్ ఆన్ డిటెక్షన్ సిస్టమ్’ అందుబాటులోకి రానుంది. కొత్తగా తయారయ్యే బైక్‌లన్నింటికీ ఈ టెక్నాలజీ తప్పనిసరి కానున్నది.

ఒక చేత్తో ఫోన్ మాట్లాడుతూ.. మరో చేత్తో బైక్ డ్రైవింగ్ చేస్తామంటే నడ్వద్. రెండు చేతులు బైక్ హ్యాండిల్ మీద ఉండాల్సిందే. లేకపోతే దబిడి దిబిడే!! బండి ఆటోమేటిక్గా స్లో అవుతుంది.. దానంతట అదే రన్నింగ్లోనే ఆగిపోతుంది. ఇలాంటి సరికొత్త టెక్నాలజీతో బైక్స్ను రెడీ చేయించేలా కేంద్ర రవాణా శాఖ మౌఖికంగా నిర్ణయం తీసుకుంది. దీన్ని హ్యాండ్స్ ఆన్ డిటెక్షన్ సిస్టమ్ అంటారు. త్వరలోనే కంపెనీలు ఇలాంటి సెన్సార్తో కూడిన బండ్లను తయారు చేయనున్నారు. రోడ్డు ప్రమాదాలను గమనంలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ తరహా ఆలోచనలకు శ్రీకారం చుట్టింది. బైక్‌ తయారీ కంపెనీలు ఇందుకోసం ప్రత్యేకంగా సెన్సార్‌ టెక్నాలజీని ఉపయోగించనున్నాయి. త్వరలోనే కేంద్ర రవాణా మంత్రిత్వశాఖ స్పష్టమైన పాలసీని తీసుకురాబోతున్నది. ప్రస్తుతం త్రీ-లేయర్ సెక్యూరిటీ అంశాలతో రూపొందిన ముసాయిదా పాలసీపై అధ్యయనం జరుగుతున్నది. ట్రాఫిక్ పోలీస్, రోడ్ సేఫ్టీ ఎక్స్‌పర్ట్స్, ఆటోమొబైల్ కంపెనీలు, రవాణా శాఖ, పరిశ్రమల సమాఖ్య ప్రతినిధులతో సంప్రదింపులు జరిపిన తర్వాత కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వశాఖ దీనిపై ఫైనల్ డెసిషన్ తీసుకుంటుంది.

బైక్ స్టంట్స్, మొబైల్ డ్రైవింగ్‌కు చెక్

బైక్ నడుపుతున్నప్పుడు రెండు చేతులు హ్యాండిల్‌పై లేకపోతే వాహనం స్పీడ్‌ను తగ్గించడం, ఆ తర్వాత పూర్తిగా ఆపివేసే తీరులో కేంద్ర రవాణా మంత్రిత్వశాఖ మూడంచెల సెక్యూరిటీ సిస్టమ్ గురించి ఆలోచించింది. బైక్ లేదా స్కూటర్ నడిపే సమయంలో రెండు చేతులూ హ్యాండిల్‌పై ఉన్నాయో లేవో వాహనం ఆటోమేటిక్‌గా గుర్తించడం ఈ టెక్నాలజీలోని ప్రత్యేకత. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బైక్ స్టంట్లు, అధిక వేగం, మొబైల్ ఫోన్ వినియోగం వంటి ప్రమాదకర అలవాట్లను నియంత్రించడం దీని వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం.

మూడంచెల సెక్యూరిటీ సిస్టమ్

రెండు చేతులూ హ్యాండిల్ బార్‌పై లేకపోతే బైక్ స్టార్ట్ కాదు. రన్నింగ్ టైమ్‌లో స్పీడ్ తగ్గిపోతుంది. మొత్తం మూడు రకాల భద్రతాపరమైన అంశాలు ఈ టెక్నాలజీలో ఉంటాయి. అవి,

• ఫస్ట్ సెక్యూరిటీ : రైడర్ రెండు చేతులూ హ్యాండిల్‌ బార్‌పై ఉంచినట్లు సెన్సార్లు గుర్తించడం. ఆ తర్వాతే బైక్/స్కూటర్ స్టార్ట్ అవుతుంది. హ్యాండిల్‌ బార్‌పై చేతులు ఉన్నాయో లేవో గుర్తించడానికి ప్రత్యేక గ్రిప్ లేదా ప్రెజర్ సెన్సార్లు ఉంటాయి. బైక్ రైడర్ పూర్తి కంట్రోల్‌లో ఉన్నారో లేదో నిర్ధారించుకుంటుంది.

• సెకండ్ సెక్యూరిటీ : బైక్/స్కూటర్ నడుస్తున్న సమయంలో ఒక్క చేయి హ్యాండిల్ నుంచి తీసేసినా వెంటనే హెచ్చరికలు జారీ చేసే వ్యవస్థ ఉంటుంది. ఆడియో అలర్ట్‌లు ఇస్తుంది. డ్యాష్‌బోర్డ్ మీద వార్నింగ్ మెసేజ్ ఇస్తుంది. ఫ్లాషింగ్ విజువల్ ఇండికేటర్లు ఆన్ అవుతాయి. స్టంట్లు చేయడం, మొబైల్ ఫోన్ ఉపయోగించడం, కంట్రోల్ కోల్పోయే విధంగా ప్రయాణించడం.. ఇలాంటి చర్యలను గుర్తించి రైడర్‌ను అప్రమత్తం చేయడమే దీని ఉద్దేశం.

• థర్డ్ సెక్యూరిటీ : రైడర్ ఎక్కువసేపు చేతులు లేకుండా వాహనాన్ని నడుపుతున్నట్లు గుర్తిస్తే, ఆ బైక్/స్కూటర్ వేగం ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. సడెన్‌గా బ్రేక్ వేస్తే ప్రమాదం జరిగే ఆస్కారాన్ని గమనంలోకి తీసుకుని గ్రాడ్యువల్‌గా వేగాన్ని తగ్గించే విధానం ఈ టెక్నాలజీలో ఉంటుంది. దీంతో బైక్ రైడర్ కంట్రోల్‌లోకి వస్తారు. ఇతరులకూ ప్రమాదం తలెత్తకుండా ఉంటుంది. చివరకు ఇంజిన్ ఆఫ్ అవుతుంది.

బైక్‌, స్కూటర్ల రేట్లు పెరిగే చాన్స్

కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఈ టెక్నాలజీ వినియోగంలోకి వస్తే కొత్తగా తయారై రోడ్లమీదకు వచ్చే అన్ని బైక్‌లు, స్కూటర్లకు ‘ఇన్-బిల్ట్’గా ఉంటుంది. ధరలు సుమారు వెయ్యి రూపాయలు పెరిగే అవకాశం ఉంది. ఈ టెక్నాలజీ ప్రకారం ప్రతీ బైక్/స్కూటర్‌కు గ్రిప్ డిటెక్షన్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ కంట్రోల్ మాడ్యూల్స్, అలారం వార్నింగ్ సిస్టమ్, స్పీడ్ కంట్రోల్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్.. ఇవన్నీ అమర్చాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదన ముసాయిదా దశలో ఉన్నందున వాహన తయారీ సంస్థలు, రోడ్డు భద్రతా నిపుణులు, పరిశ్రమ సంఘాలు, రవాణా శాఖ అధికారులతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపిన తర్వాత ఫైనల్ చేస్తుంది.

సైడ్‌ స్టాండ్‌ ఉంటే.. బైక్‌ ఆఫ్!

రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ద్విచక్ర వాహనాల్లో సెఫ్టీ టెక్నాలజీని కేంద్ర రవాణా శాఖ మస్ట్ గా అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే ‘సైడ్‌ స్టాండ్‌ ఇంజిన్‌ కట్‌-ఆఫ్‌ సిస్టమ్‌’ను తెచ్చింది. సైడ్‌ స్టాండ్‌ కిందికి ఉండగా బైక్‌ను గేర్‌లో వేస్తే ఇంజిన్‌ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. కొన్ని మోడళ్లలో స్టాండ్‌ కిందికి ఉంటే బైక్‌ స్టార్ట్‌ కూడా కాదు. దీంతో స్టాండ్‌ వేసినట్టే మర్చిపోయి ప్రయాణించడం వల్ల జరిగే ప్రమాదాలకు ఇది చెక్ పెడుతున్నది. ఈ ఫీచర్స్తో చాలా కంపెనీలు కొత్త బండ్లను తయారు చేస్తున్నాయి. 2019 నుంచి ఇది అమలులోకి వచ్చింది.

ఇప్పటికే ఉన్న సెఫ్టీ ఫీచర్స్ :

యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్: ఆకస్మిక బ్రేక్ వేసినప్పుడు వాహనం స్కిడ్‌ కాకుండా ఇది నియంత్రిస్తుంది.
కాంబైన్డ్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌: ముందు, వెనుక బ్రేకులు సమన్వయంతో పనిచేసేలా చేస్తుంది. ముందు బ్రేక్ వేస్తే ఆటోమెటిక్గా వెనక బ్రేక్ కూడా పడుతుంది. వెనక బ్రేక్ వేస్తే ఆటోమెటిక్గా ముందుకు బ్రేక్ కూడా పడుతుంది. తెలియకుండా కొందరు ముందు బ్రేక్ వేసి స్కిడ్ అయి ప్రమాదాలకు గురైన సందర్భాలు ఉన్నాయి. దీంతో కాంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్తో కంపెనీలు బైక్లను తీసుకొస్తున్నాయి.

హెల్మెట్‌ రిమైండర్‌ వ్యవస్థ: కొన్ని బైక్స్ మోడళ్లలో హెల్మెట్‌ ధరించాలంటూ వాహనదారుడికి సూచనలు చేసే సిస్టమ్ ఇది.

త్వరలో హ్యాండ్స్ ఆన్ డిటెక్షన్ సిస్టమ్: సైడ్‌స్టాండ్ కట్‌-ఆఫ్ తరహాలోనే, బైక్‌పై స్టంట్లు, నిర్లక్ష్య డ్రైవింగ్‌ను అరికట్టేందుకు హ్యాండిల్‌పై చేతుల ఉనికిని గుర్తించే సిస్టమ్ను తేవాలని కేంద్ర రవాణా శాఖ చూస్తున్నది. ఈ టెక్నాలజీతో బైక్స్ వస్తే.. రోడ్డు ప్రమాదాలు మరింత తగ్గుతాయని కేంద్రం భావిస్తున్నది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>