కలం, వెబ్ డెస్క్: ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో “ఇండియా కూటమి (INDIA Alliance)” నేతలు సోమవారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి దేశ రాజకీయాల్లోని ప్రముఖ ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమావేశంలో పాల్గొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కూడా భేటీకి హాజరయ్యారు. ఇక జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సహా పలువురు కీలక నేతలు సమావేశంలో పాల్గొని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. రానున్న ఎన్నికలు, ధరల పెరుగుదల, ఎస్ఐఆర్, మహిళా రిజర్వేషన్ బిల్లు, ఎన్డీయే ప్రభుత్వ పోరాటంపై కార్యాచరణ వంటి అంశాలపై చర్చించారు. తమిళానాడు అసెంబ్లీ ఎన్నికల పరిణామాల నేపథ్యంలో డీఎంకే పార్టీ, వ్యూహాత్మక కారణాలతో ఆప్ (AAP) పార్టీ దూరంగా ఉన్నాయి.
సీఎం విజయ్‌కు అందని ఆహ్వానం..
తమిళనాడు కొత్త సీఎం జోసెఫ్ విజయ్‌కి ‘ఇండియా’ కూటమి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కూటమి పార్టీ సమావేశం నేపథ్యంలో విజయ్ టీవీకే పార్టీకి అనూహ్య పరిణామం ఎదురైంది. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఉమ్మడి వ్యూహాన్ని రచించేందుకు నేటి ఇండియా కూటమి సమావేశానికి సీఎం విజయ్‌కు ఆహ్వానం దక్కలేదు. తమిళనాడులో కాంగ్రెస్‌కు అత్యంత ఆప్తుడిగా మారిన విజయ్ ఈ భేటీకి హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇండియా కూటమిని రద్దు చేయాలి..
ఇండియా కూటమిని అధికారికంగా రద్దు చేయాలని జనతాదళ్ (యునైటెడ్) స్పష్టం చేసింది. కూటమికి స్పష్టమైన నాయకత్వం లేదని, ప్రజల ముందుకు తీసుకెళ్లే ఉమ్మడి అజెండా కూడా కనిపించడం లేదని జేడీయూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. కూటమిలోని పార్టీలు ఎన్నికల్లో ఒకదానిపై మరొకటి పోటీ చేస్తున్నాయని, కీలక నిర్ణయాల విషయంలో ఏకాభిప్రాయం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండియా కూటమి సమావేశానికి పలువురు భాగస్వామ్య పార్టీలు కూడా హాజరు కాకపోవడాన్ని జేడీయూ ప్రశ్నించింది.

