కలం, కరీంనగర్ బ్యూరో (జగిత్యాల): సంచలనం కలిగించిన బీటెక్ విద్యార్థి అదృశ్యం చివరికి విషాదాంతంగా ముగిసింది. జగిత్యాల (Jagtial) జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామానికి చెందిన అంకం రాహుల్ హైదరాబాద్ సైదాబాద్‌లోని మాతృశ్రీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. గత నెల 27వ తేదీన స్నేహితులతో కలిసి టూర్‌కు వెళ్తున్నానంటూ ఇంట్లో వారికి సమాచారం ఇచ్చి అదృశ్యమయ్యాడు. రెండు రోజులైనా ఫోన్ లేకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనతో అతడి స్నేహితులకు ఫోన్లు చేసినా.. తమకు తెలియదని వివరించారు. చివరిసారి రాహుల్ కాచిగూడ స్టేషన్ వద్ద కనిపించడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చేపట్టారు. తన కుమారుడి ఆచూకీ కనిపెట్టాలని అతడి తల్లి, సోదరి ఓ వీడియో ద్వారా కోరగా.. మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించారు. వెంటనే విచారణ చేపట్టాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను ఆదేశించడంతో మరింత వేగవంతం చేశారు.
శబరి ఎక్స్‌ప్రెస్ ఎక్కి..
రాహుల్ కాచిగూడలో ఎంఎంటీఎస్ రైలు ఎక్కి, సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చి శబరి ఎక్స్‌ప్రెస్ ఎక్కినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. ఈ సమాచారాన్ని ఏపీ పోలీసులకు కూడా పంపించారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలోని ఓ బావిలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యమైనట్లు సింగరాయకొండ పోలీసులకు తెలిసింది. అది రాహుల్‌దే అని నిర్ధారించుకుని కాచిగూడ పోలీసులకు సమాచారం అందించడంతో తల్లిదండ్రులకు ఫోన్‌లో చెప్పారు. దీంతో, వెంటనే వారు ఘటనా స్థలానికి బయల్దేరారు. రాహుల్ మృతితో అయిలాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

