కలం, కరీంనగర్ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో మైనింగ్ అక్రమాల వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సాగిన మానేరు ఇసుక దందా (Maneru Sand Mining Scam)పై ప్రభుత్వ అధికార యంత్రాంగం విచారణను ముమ్మరం చేసింది. అదే విధంగా కరీంనగర్ గ్రానైట్ అక్రమాలపైనా ఆరా తీస్తున్నది. ఈ మొత్తం వ్యవహారంలోకి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (CID) రంగంలోకి దిగడంతో స్థానిక నేతల్లో తీవ్ర అలజడి మొదలైంది. గత ప్రభుత్వ హయాంలో నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి, వందల కోట్ల రూపాయల ఇసుక దోపిడీకి పాల్పడినట్లు మైనింగ్ శాఖ క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. రాయల్టీ, జీఎస్టీ, సీనరేజ్ ఫీజుల ఎగవేత భారీగా జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ మాఫియా ప్రతిరోజూ సుమారు 800 టిప్పర్ల ఇసుకను హైదరాబాద్, బెంగళూరు మార్కెట్లకు అక్రమంగా తరలించినట్లు తెలుస్తున్నది.
700కు పైగా కొండలు మాయం
రవాణా సాఫీగా సాగేందుకు నకిలీ వే-బిల్లులతో అధికారులను బురిడీ కొట్టిస్తూ.. జీపీఎస్, ఆన్‌లైన్ ట్రాకింగ్ పరిధిలోకి రాకుండా ఈ మాఫియా గుట్టుచప్పుడు కాకుండా వాహనాలను నడిపింది. నిబంధనల ప్రకారం 3 మీటర్ల లోతు వరకే ఇసుక తవ్వకాలకు అనుమతి ఉన్నా.. భారీ యంత్రాలతో 25 నుంచి 30 అడుగుల లోతు వరకు తవ్వడంతో భూగర్భ జలాలు పడిపోయి బావులు ఎండిపోయాయని ఎన్జీటీ, కాగ్ నివేదికలు ఎండగట్టాయి. మైనింగ్ దోపిడీ వల్ల జిల్లాలో దాదాపు 700కు పైగా కొండలు మాయమైపోయాయని, పర్యావరణం తీవ్రంగా దెబ్బతిందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయ అండదండలపై ఫోకస్
ఈ ఇసుక మాఫియా వెనుక ఉన్న రాజకీయ అండదండలపై సీఐడీ ఇప్పుడు ప్రత్యేక దృష్టి సారించింది. 2014-2026 మధ్య జరిగిన మైనింగ్ అక్రమాలపై సమగ్ర విచారణలో భాగంగా మైనింగ్ శాఖ తన ప్రాథమిక నివేదికను సీఐడీకి అందజేసింది. ఈ నివేదిక ఆధారంగా సూత్రధారుల జాబితాను సిద్ధం చేస్తున్న సీఐడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. విచారణలో ఓ మాజీ ఎంపీతో పాటు అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర బయటపడితే, వారి చుట్టూ చట్టపరమైన ఉచ్చు బిగుసుకోవడం ఖాయమని స్థానిక రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తున్నది. మరోవైపు, ముగ్గురు మాజీ మంత్రులు టార్గెట్‌గా విచారణ సాగుతోందనే చర్చ జరుగుతున్నది. ఫెమా నిబంధనల ఉల్లంఘన, రూ.750 కోట్ల పన్ను ఎగవేత వంటి ఆరోపణల నేపథ్యంలో గత పాలకులు నోటీసులను తొక్కిపెట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మళ్లీ తెరపైకి నేరేళ్ల ఉదంతం
– ఈ ఇసుక దందా వల్ల గతంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేరేళ్ల ఘటనను రాజకీయ వర్గాలు ఇప్పుడు గుర్తు చేస్తున్నాయి.
– అక్రమ ఇసుక రవాణాను ప్రశ్నించిన నేరేళ్ల గ్రామస్తులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ ఇసుక వ్యవహారం కారణంగా అప్పట్లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కూడా రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
– సిరిసిల్ల నియోజకవర్గంలో సాగిన ఇసుక అక్రమాలు, నేరేళ్ల ఘటన స్థానికంగా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత తెచ్చిపెట్టాయి. ఇది కేటీఆర్ ఇమేజ్‌పైనా తీవ్ర ప్రభావం చూపింది.

