Mobile Popup Ad
Mobile Popup Ad

పని ఏదైనా 10 నిమిషాలు ముందుంటున్నారా.. ఆ రహస్యం ఇదే!

కలం, వెబ్ డెస్క్ : ఆఫీసు మీటింగ్ అయినా, డాక్టర్‌ అపాయింట్‌మెంట్ అయినా, ఉద్యోగ ఇంటర్వ్యూకు అయినా, స్నేహితులను కలవడానికి అయినా.. కొందరు ఎప్పుడూ ఒక పది నిమిషాలు ముందుగానే చేరిపోతారు (People Arrive Early). అపాయింట్‌మెంట్ సమయానికి ఇంకా పది, పదిహేను నిమిషాలు ఉన్నా వారు అక్కడే కనిపిస్తారు. చాలా మంది దీనిని టెన్షన్‌గా, అతిగా జాగ్రత్తపడే స్వభావం, చాలా పంక్చువల్ అని భావిస్తారు. కానీ నిపుణులు మాత్రం దీనిని వేరే కోణంలో చూస్తున్నారు.

రిలేషన్స్‌పై అధ్యయనం చేసే పరిశోధకుల ప్రకారం, ఎప్పుడూ సమయానికి ముందే చేరే అలవాటు చాలా సందర్భాల్లో పెద్దయ్యాక వచ్చిన వ్యక్తిత్వ లక్షణం కాదు. అది చిన్ననాటి అనుభవాల నుంచి ఏర్పడిన భావోద్వేగ అలవాటు కావచ్చు. కొన్ని కుటుంబాల్లో సమయం కేవలం గడియారానికి సంబంధించిన విషయం కాదు. అది ప్రేమకు, గౌరవానికి, బాధ్యతకు గుర్తుగా ఉంటుంది. సమయానికి రావడం అంటే ఎదుటివారిని గుర్తుంచుకోవడం, వారికి ప్రాధాన్యం ఇవ్వడం అనే భావన ఉంటుంది. ఆలస్యంగా రావడం మాత్రం పట్టించుకోనట్టుగా భావిస్తారు.

అలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లలు ఒక విషయం త్వరగా నేర్చుకుంటారు. మాటల్లో ప్రేమను చెప్పలేకపోయినా, ముందుగానే చేరడం ద్వారా తమ శ్రద్ధను చూపించవచ్చని అర్థం చేసుకుంటారు. అందుకే సమయపాలన వారి వ్యక్తిత్వంలో భాగమైపోతుంది. పరిశోధనలు చెబుతున్న మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఏడేళ్ల వయసుకు ముందే ఏర్పడిన కొన్ని ప్రవర్తనా అలవాట్లు జీవితాంతం కొనసాగుతాయి. చిన్నప్పుడే భద్రత, ప్రశాంతత లేదా ప్రేమను పొందడానికి ఉపయోగపడిన అలవాట్లు, పెద్దయ్యాక కూడా అలాగే కొనసాగుతాయి.

అందుకే ఇలాంటి వ్యక్తులు పెద్దయ్యాక కూడా ప్రతి కార్యక్రమానికి ముందుగానే చేరుతుంటారు. ట్రాఫిక్ లేకపోయినా అదనపు సమయం కేటాయిస్తారు. మీటింగ్ ఆలస్యమైతే అసౌకర్యంగా ఫీల్ అవుతారు. స్నేహితుడు ఇంకా రాకపోతే అతడికి ఏమైనా జరిగిందా అని ఆలోచిస్తారు. బయటివాళ్లకు ఇది ఆందోళనగా కనిపించవచ్చు. కానీ లోపల దాగి ఉన్న భావన మాత్రం వేరే. “నేను వస్తానని చెప్పి రాకపోయే వ్యక్తిని కాదు”, “నిన్ను వేచి ఉండే పరిస్థితిలో పెట్టను” అనే నిశ్శబ్ద సందేశం అందులో ఉంటుంది.

ఇలాంటి వారిని కొందరు కఠినంగా, అతిగా నియమాలు పాటించే వ్యక్తులుగా భావిస్తారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, వారి ప్రవర్తన వెనుక ఉన్నది అహంకారం కాదు. శ్రద్ధ, నమ్మకం, బాధ్యత భావన. అందుకే ఎప్పుడూ పది నిమిషాలు ముందే చేరే వాళ్లను చూసి “ఎంత టెన్షన్ పడతారో!” అని అనుకునే ముందు.. వారు తమ ప్రేమను, గౌరవాన్ని, శ్రద్ధను చూపించే భాష అదే కావచ్చని గుర్తుంచుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. వాళ్లకు సమయపాలన కేవలం అలవాటు కాదు.. ఎదుటివారు తమకు ముఖ్యమనే భావనను వ్యక్తం చేసే ఒక ప్రత్యేక మార్గం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>