కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర పోలీసు శాఖలో ఉన్న 19 వేల ఖాళీల్లో త్వరలోనే 5 వేల పోస్టులను భర్తీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) ప్రకటించారు. అలాగే గవర్నమెంట్ స్కూల్ విద్యార్థుల కోసం త్వరలో బస్సు సౌకర్యం కల్పించినున్నట్లు వెల్లడించారు. బెంగళూరులో ‘ది హిందూ’ పత్రిక ఆధ్వర్యంలో శనివారం జరిగిన ‘హడిల్’ కాంక్లేవ్లో సీఎం పాల్గొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విస్తరిస్తున్న ఈరోజుల్లో ‘వైట్ కాలర్’ ఉద్యోగాలకు ముప్పు ఉన్నా.. ‘బ్లూ కాలర్’ ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా లేదని, కాబట్టి యువత అందుకు అనుగుణంగా స్కిల్స్ మార్చుకోవాలని సూచించారు. ఇందులో భాగంగానే స్కిల్స్, స్పోర్ట్స్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయడంతో పాటు ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దుతున్నామని వివరించారు. 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మూడు ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా, రాష్ట్రాన్ని ‘క్యూర్’, ‘ప్యూర్’, ‘రేర్’ అనే మూడు ప్రత్యేక రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేస్తున్నామన్నారు.
అంబాసిడర్ కారుపై సెటైర్లు
‘‘ప్రస్తుత ఐటీఐ సిలబస్ 1950ల నాటిది, ఇప్పటికీ అందులో అంబాసిడర్ కారు రిపేర్ పాఠాలే ఉన్నాయి, కానీ రోడ్లపై అసలు ఆ కార్లే లేవు. ప్రస్తుతం అంతా ఆడీ, బీఎండబ్ల్యూ కార్ల యుగం. తెలంగాణలో ప్రస్తుతం ఒక్క అంబాసిడర్ కారు మాత్రమే కేసీఆర్ ఫాంహౌస్లో ఉంది, అది వారి ఎన్నికల గుర్తు. బహుశా ఎవరైనా ఆ కారును రిపేర్ చేయాలంటే కేసీఆర్ ఫాంహౌస్కే వెళ్లాలేమో..’’ అని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
అందుకే కాంగ్రెస్ లో చేరాను
ఈ సందర్భంగా తాను విద్యార్థిగా ఏబీవీపీలో పనిచేశానన్న సీఎం.. ఇండిపెండెంట్ గా జడ్పీటీసీ, ఎమ్మెల్సీగా గెలిచానని తెలిపారు. ఆపై టీడీపీలో చేరి రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యానని వెల్లడించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో పార్టీని వీడి, తెలంగాణ కల సాకారం చేసిన సోనియా గాంధీపై నమ్మకంతోనే కాంగ్రెస్ లో చేరానని తెలిపారు. 2018 ఎన్నికల్లో ఓడినా ఆ తర్వాత అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచి పీసీసీ అధ్యక్షుడిగా ఎదిగానని చెప్పారు. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా, 20 ఏళ్ల ప్రజా జీవితంలో ప్రజల ఆశీర్వాదంతోనే నేడు సీఎం స్థాయికి చేరుకున్నానని వ్యాఖ్యానించారు.
నన్నేవరూ తప్పుదోవ పట్టించలేరు..
బ్యూరోక్రాట్లు తెలివైన వారు, వారు చెప్పే ప్రతిదానికీ ‘ఎస్’ అనకుండా, ఆ మాట వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యమని సీఎం పేర్కొన్నారు. అధికారులను సంతోషపెట్టడం కంటే, సమస్యను అర్థం చేసుకోవడంలో కామన్ సెన్స్కు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. 17 ఏండ్ల ప్రతిపక్ష రాజకీయ జీవితం తనకు ఎన్నో పాఠాలు నేర్పిందని, అందుకే ఎవరూ తనను తప్పుదోవ పట్టించలేరని స్పష్టం చేశారు. చిన్న రైతు లేదా నిరక్షరాస్యుడు సైతం తన కామన్ సెన్స్తో పరిష్కారం చూపగలడని, పాలనలో కూడా అదే కీలమని వ్యాఖ్యానించారు.
మహిళా రిజర్వేషన్లపై జిమ్మిక్కులు వద్దు..
మహిళా రిజర్వేషన్ల రూపకర్తలం తామేనని, సోనియా గాంధీ నాయకత్వంలోనే మహిళలు అత్యున్నత పదవులు చేపట్టారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రధాని మోదీ మహిళా రిజర్వేషన్ల పేరుతో రాజకీయ జిమ్మిక్కులు చేస్తున్నారని, పార్లమెంట్ సీట్ల పెంపుతో దీన్ని ముడిపెట్టడం సరికాదని ఆయన విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాలను శిక్షించేలా ఉన్న డీలిమిటేషన్ ప్రక్రియను తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే, వచ్చే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనే దీన్ని అమలు చేయాలని సవాల్ విసిరారు. డీలిమిటేషన్ పేరుతో ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య బీజేపీ రాజకీయ విభేదాలు సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు.
పెద్దల ఆట కట్టించేందుకే హైడ్రా
చెరువులు, నాలాలను ఆక్రమించి జలవనరులను దెబ్బతీస్తున్న పెద్దల ఆట కట్టించేందుకే హైడ్రాను ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఎవరూ ఆక్రమణలకు సాహసించే పరిస్థితి లేదని వెల్లడించారు. ప్రతి నగరానికి భౌగోళిక పరిస్థితులను బట్టి ప్రత్యేక పాలనా నమూనాలు అవసరమని, ఆ దిశగానే హైదరాబాద్ లో చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు అత్యుత్తమ ‘ఈగల్ ఫోర్స్’ను ఏర్పాటు చేశామని వివరించారు.

