కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మంత్రివర్గ (Telangana Cabinet) విస్తరణ, పునర్‌వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైంది. వారం, పది రోజుల్లో ఉండొచ్చని ఇటు సచివాలయ వర్గాలు, అటు కాంగ్రెస్ వర్గాలు సూత్రప్రాయంగా తెలిపాయి. ఒకరిద్దరు కీలక మంత్రులకు ఉద్వాసన తప్పదనే మాటలు వినిపిస్తున్నాయి. అందులో ఒకరికి అసెంబ్లీ స్పీకర్ పోస్టు, మరొకరికి ఇతర రాష్ట్రంలోని పార్టీ ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పజెప్పాలన్నది యోచిస్తున్నారు. ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ మంత్రివర్గంలోకి రానున్నారని వాదన కూడా ఉంది. పలువురు మంత్రుల పనితీరు, వారిపై వస్తున్న ఆరోపణల ఆధారంగా శాఖలు కూడా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
మంత్రుల పనితీరు ఆధారంగానే..!
అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, ప్రజల సమస్యలు, సంక్షేమ పథకాలు, చేపట్టాల్సిన అభివృద్ధిని అవగాహన చేసుకోడానికి సరిపోయిందనేది ప్రభుత్వ పెద్దల మాట. ఇక నుంచి పాలన మరింత స్పీడప్ చేయాలని భావిస్తోంది. మంత్రుల పనితీరుతో పాటు వారిపై వచ్చిన ఆరోపణలు, అందులోని వాస్తవాలు తదితరాలను ప్రాతిపదికగా తీసుకోవాలనే నిర్ణయించుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలందరి ప్రోగ్రెస్ రిపోర్టు తన దగ్గర ఉన్నదంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రకటించారు.
మంత్రులకు పూర్తి స్వేచ్ఛనిచ్చినా.. కొందరి పనితీరు ఏమాత్రం ఆశాజనకంగా లేదనేది సీఎం భావన. కొందరు తమ శాఖలను మొక్కుబడిగా నిర్వహిస్తుంటే, మరికొందరు వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుంటున్నారన్న అభిప్రాయం ఉన్నట్లు సీఎంవో వర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు పూర్తయింది. ఈ సందర్భంగా కేబినెట్‌కు ఇదే చివరి విస్తరణ, పునర్‌వ్యవస్థీకరణ తరహాలో ‘పొలిటికల్ సర్జరీ’ జరగనున్నది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ‘ఎలక్షన్ టీమ్’గా కొత్త మంత్రి వర్గాన్ని తీర్చిదిద్దాలన్నది పార్టీ భావన.
భారీ స్థాయిలోనే ప్రక్షాళన..
ఈసారి జరగబోయేది సాధారణ ‘విస్తరణ’ కాదని, భారీ స్థాయి ప్రక్షాళన అనే అభిప్రాయం పార్టీ, ప్రభుత్వ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. కీలక మంత్రికి ఉద్వాసన తప్పదనే బలమైన టాక్ వినిపిస్తోంది. మరికొందరు మంత్రులను కూడా తొలగించి, వారికి ఏఐసీసీ స్థాయిలో కీలకమైన సంస్థాగత బాధ్యతలు అప్పజెప్పబోతున్నారని సమాచారం. వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోయే గుజరాత్, గోవా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌లుగా పంపే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తున్నది. విద్యా శాఖను ప్రస్తుతం సీఎం తన దగ్గరే ఉంచుకున్నందున ఇటీవలే ఎమ్మెల్సీ అయిన ఒకరికి దీన్ని ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఆశావహుల ప్రయత్నాలు..
మంత్రివర్గంలో (Telangana Cabinet) స్థానం కోసం పలువురు ఎమ్మెల్యేలు పోటీపడుతున్నారు. ప్రస్తుతం రెండు పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. కొందరు మంత్రులను తొలగించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తుండటంతో తమను తీసుకోవాలని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేను కలిసి ఎమ్మెల్యేలు కోరుతున్నారు. మంత్రి పదవి కోసం దిల్లీలో అగ్రనేతలను కలుస్తున్నవారిలో స్పీకర్ గడ్డం ప్రసాద్, మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు. సమర్థులైన కొందరు మంత్రులకు అదనపు బాధ్యతలు అప్పగించడం, ప్రస్తుతం ఉన్న శాఖలను మార్చడం ద్వారా పాలనలో వేగం పెంచాలన్నది సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన. వారం పది రోజుల్లో కేబినెట్ విస్తరణలో ఏం జరగనున్నదనేది క్లారిటీ రానున్నది. ఎవరికి ఊస్టింగ్.. ఎవరికి పోస్టింగ్ అనేది తేలనున్నది.
మీనాక్షి స్థానంలో ఎవరు?
కాంగ్రెస్ పార్టీలోనూ సంస్థాగతంగా భారీ మార్పులు జరగనున్నాయి. ఇప్పటిదాకా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల కోసం బీజేపీని పార్లమెంట్ వేదికగా టార్గెట్ చేసేందుకు పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ లాంటి వారిని హైకమాండ్ ఎంపిక చేసింది. దీంతో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా మీనాక్షి తగిన సమయాన్ని వెచ్చించలేకపోవచ్చు. ఈ నేపథ్యంలోనే కొత్త ఇన్‌ఛార్జి వచ్చే అవకాశమున్నట్లు గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి.
Read Also: మెట్రో సెకండ్ ఫేజ్.. ఇంకా పరిశీలనలోనే!
Follow Us On : WhatsApp

