కలం, నల్లగొండ బ్యూరో : మునుగోడు నియోజకవర్గంలో ఎక్సైజ్ దుకాణాల వ్యవహారం రసవత్తరంగా మారింది. ఇక్కడ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి (Rajgopal Reddy) వర్సెస్ ఎక్సైజ్ శాఖగా పరిస్థితి తయారయ్యింది. తెలంగాణ మొత్తం మద్యం దుకాణాలు ఒకలా నడుస్తుంటే.. మునుగోడు (Munugode) నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పెషల్ రూల్స్ తో ఆంక్షలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల వైన్స్ నిర్వాహకులపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెట్టిన రూల్స్ అతిక్రమించిన వారిపై భౌతికంగా.. మానసికంగా దాడులు చేస్తున్న వ్యవహారం ఇటీవల పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఎక్సైజ్ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. మునుగోడు నియోజకవర్గంలో ఉదయం నుంచే మద్యం దుకాణాలను ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది దగ్గరుండి మరి ఓపెన్ చేయించారు.
సంస్థాన్ నారాయణపురంలో కాంగ్రెస్ ఆందోళన..
మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణపురంలో ఎక్సైజ్ అధికారుల వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ నాయకుల ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షరతులను ధిక్కరిస్తూ వైన్స్ షాప్ లను ఎక్సైజ్ అధికారులు (Excise Dept) ఓపెన్ చేయించారు. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాతనే వైన్స్ తెరవాలని కాంగ్రెస్ నాయకులు ఎక్సైజ్ అధికారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తమ నిర్ణయంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారంటూ ఎక్సైజ్ అధికారులతో ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి వర్గీయులు వాగ్వాదానికి దిగారు. మా సార్ చెప్పిన టైమ్‌కే వైన్ షాపులు తెరవాలని, లేదంటే షాపులు మొత్తానికి మూసేస్తామని హెచ్చరించారు.
వైన్ షాపుల ముందు అనుచరుల వీరంగం..
మునుగోడు (Munugode) నియోజకవర్గంలో మద్యానికి బానిసై ఏ కుటుంబం రోడ్డున పడొద్దనే ఉద్దేశంతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మద్యం దుకాణాలపై ప్రత్యేక ఆంక్షలు విధించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నియోజకవర్గంలో మద్యం దుకాణాలను మధ్యాహ్నం ఒంటిగంట తర్వాతే ఓపెన్ చేయాలని, సాయంత్రం 6 గంటలకు సిట్టింగ్ ఏర్పాటు చేయాలని వైన్స్ నిర్వాహకులకు హుకుం జారీ చేశారు. ఈ క్రమంలో ఈ నిబంధనలు కాస్తా పెద్ద వివాదానికి దారితీసాయి. రూ.లక్షలు పెట్టి టెండర్లలో మద్యం దుకాణాలను దక్కించుకున్న యాజమాన్యాలు ఈ రూల్స్ అమలు చేసేందుకు ఇష్టపడడం లేదు. ఈ క్రమంలో తరచూ మునుగోడు నియోజకవర్గంలో మద్యం దుకాణాల నిర్వాహకులతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు తరచూ వివాదాలకు దిగుతున్నారు.
ఇటీవల చండూరు మండల కేంద్రంలో వైన్స్ నిర్వాహకులు సాయంత్రం 6 గంటల కంటే ముందుగానే సిట్టింగ్ రూమ్ ఓపెన్ చేశారని భౌతిక దాడికి దిగారు. మద్యం దుకాణంలో ఉన్న వారిని బయటకు లాక్కొచ్చి మరి దాడి చేయడం స్థానికంగా దుమారం రేపింది. ఈ క్రమంలోనే ఎక్సైజ్ అధికారుల తీరు పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో శుక్రవారం ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది రంగ ప్రవేశం చేసి మునుగోడు నియోజకవర్గంలో ప్రతి మద్యం దుకాణాన్ని దగ్గరుండి మరి ఉదయం 10 గంటలకే ఓపెన్ చేయించారు. ఎలాంటి వివాదాలు చోటు చేసుకోకుండా పహారా కాస్తూ మద్యం అమ్మకాలను కొనసాగిస్తుండటం గమనార్హం.
Read Also: ‘ఆజాద్ హింద్’ గా అండమాన్ నికోబార్ .. ప్రధాని మోదీకి కవిత డిమాండ్
Follow Us On: Pinterest


