కలం, తెలంగాణ బ్యూరో: నేషనల్ హీరో సుభాష్ చంద్ర బోస్ గౌరవార్థం ‘అండమాన్ నికోబార్’ (Andaman Nicobar) పేరును ‘ఆజాద్ హింద్’ (Azad Hind) గా మార్చాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) డిమాండ్ చేశారు. ఎప్పటి నుంచో ఉన్న ఈ డిమాండ్ ను గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ నెరవేర్చాలని ఆమె కోరారు. ఇందుకోసం హ్యాష్ ట్యాగ్ మూవ్ మెంట్ నడిపిస్తామని ప్రకటించారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ బర్త్ డే సందర్భంగా శుక్రవారం ఆల్ ఇండియా ఫార్మర్డ్ బ్లాక్ ప్రతినిధులతో కలిసి కవిత వేడుకలు నిర్వహించారు. ఆడబిడ్డలకు ఆనాడే తుపాకులు ఇచ్చి దేశం కోసం కొట్లాడాలని చెప్పిన గొప్ప హీరో సుభాష్ చంద్రబోస్ (Subhas Chandra Bose) అని, ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్తామని తెలిపారు. ‘స్వతంత్రం రావాలంటే అడుక్కుంటే రాదు.. తీసుకుంటే వస్తుంది.. మీ రక్తాన్ని ఇవ్వు.. మీకు స్వతంత్రాన్ని ఇస్తా’ అంటూ యువతను మేల్కొల్పిన గొప్పవ్యక్తి చంద్రబోస్ అని కవిత గుర్తుచేశారు.
‘‘మేం ఆడబిడ్డలం రోడ్డు మీదికి వచ్చి ధర్నాలు చేసేవరకు కూడా మాకు ఇప్పుడు 33 శాతం రిజర్వేషన్లు రాలే. కానీ, ఆ నాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ దేశం బయట ఆజాద్ హింద్ ఫోర్స్ నిర్మాణం చేస్తే.. దానిలో రాణి ఝాన్సీ రెజిమెంట్ అని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఎంతో మంది ఆడబిడ్డలకు తుపాకీ ఇచ్చి దేశం కోసం కొట్లాడాలని పిలుపునిచ్చారు. ఆయన స్ఫూర్తిని అందరం తీసుకోవాలి. నేతాజీ మన సంపద. ఆయన చరిత్ర భవిష్యత్తు తరాలకు తెలియాల్సిన అవసరం ఉంది. రిపబ్లిక్ డే సందర్భంగా అండమాన్ నికోబార్ పేరును ఆజాద్ హింద్ గా మార్చాలని ప్రధాని మోదీని మేం కోరుతున్నాం” అని కవిత (Kavitha) తెలిపారు.
Read Also: సిట్ పేరుతో టైంపాస్ : బండి సంజయ్
Follow Us On: Instagram


