డ్యామిట్.. డిఫెన్సులో బీఆర్ఎస్.. డ్రగ్స్ చిక్కులు

కలం, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకున్న బీఆర్ఎస్‌కు ఊహించని షాక్ తగిలింది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, గాంధీ సరోవర్ ప్రాజెక్టులపై ప్రభుత్వాన్ని నిలదీయాలనుకున్న తరుణంలో డిఫెన్సు (BRS on Defensive) లో పడాల్సి వచ్చింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌజ్‌లో డ్రగ్స్ దొరకడం, ఆయనకు టెస్టింగ్‌లో పాజిటివ్ రావడంతో బీఆర్ఎస్ దిగ్భ్రాంతికి గురైంది. అటు సమర్ధించుకోలేక.. ఇటు వ్యతిరేకించలేక.. సతమతమవుతున్నది. రోహిత్‌రెడ్డి వ్యక్తిగత వ్యవహారమని కూడా చెప్పుకోలేని ఆత్మరక్షణలో పడింది.

పైలట్ రోహిత్ రెడ్డిని కేసీఆర్ గతంలో ఆణిముత్యం అంటూ భుజానికెత్తుకున్నారు. ఇప్పుడు డ్రగ్స్ వ్యసనపరుడనే ముద్ర తప్పలేదు. దీంతో ఎలాంటి ప్రకటన చేసినా ముందు నుయ్యి.. వెనక గొయ్యి తరహాలో ఇరుక్కుపోవాల్సి వస్తుందనే అభిప్రాయంతో బీఆర్ఎస్ నేతలు సైలెంట్ అయిపోయారు. మూసీ నది బ్యూటిఫికేషన్ పేరిట పేదల ఇళ్లను కూల్చడంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటన విడుదల చేసిన రోజే పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ తో పట్టుబడడం హాట్ టాపిక్ గా మారింది.

డ్రగ్స్ కేసుపై బీఆర్ఎస్ స్పందనేది..?

మొయినాబాద్ ఫామ్ హౌజ్ డ్రగ్స్ పరిణామంపై ఇప్పటివరకూ గులాబీ బాస్ కేసీఆర్ గానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గానీ స్పందించలేదు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని సమర్థిస్తూ ప్రకటన విడుదల చేస్తే చేటు అనే ఆందోళన ఒకవైపు.. ఖండిస్తే అది కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్‌గా మారుతుందనే భావన మరోవైపు బీఆర్ఎస్‌ను పట్టి పీడిస్తున్నది. ఈ కారణంగానే ఎలాంటి ప్రకటన చేయకుండా మౌన వ్యూహాన్ని అమలు చేస్తున్నది. సరిగ్గా ఈ అంశాన్నే కొందరు కాంగ్రెస్ నేతలు ప్రస్తావించారు. ఒకరిద్దరు కాంగ్రెస్ నాయకులైతే ఒక అడుగు ముందుకు వేసి కేటీఆర్‌కు డ్రగ్స్ అలవాటేనని.. గతంలో సీఎం రేవంత్ రెడ్డి విసిరిన డ్రగ్స్ ఛాలెంజ్‌కు కూడా తోక ముడిచారని గుర్తుచేశారు. వైట్ ఛాలెంజ్‌కు వెనకాడడంతో పాటు పొలిటికల్ సవాళ్ళకు రియాక్ట్ కాబోనంటూ తెలివిగా తప్పించుకున్నారనే విమర్శలను కూడా కేటీఆర్ అప్పట్లో మూటగట్టుకున్నారు.

కక్కలేక.. మింగలేక..బీఆర్ఎస్ పాట్లు :

ఒకప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో దేశవ్యాప్తంగా సంచలన రేపిన ఫామ్ హౌజ్‌లోనే ఇప్పుడు డ్రగ్స్ పట్టుబడడం గమనార్హం. వీకెండ్ పార్టీ పేరుతో డ్రగ్స్ అక్కడ రెడ్ హ్యాండెడ్‌గా దొరకడంతో పాటు మొత్తం 11 మందిలో ఏడుగురికి టెస్టింగ్‌లో పాజిటివ్ రావడం గమనార్హం. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సిట్టింగ్ ఎంపీతో పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి సైతం పాజిటివ్ వచ్చింది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ డొల్లతనాన్ని ప్రశ్నిద్దామని అనుకున్న బీఆర్ఎస్ పరిస్థితి ‘ముందు నుయ్యి వెనుక గొయ్యి’లా మారింది. ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించాలనుకున్న సంగతి ఎలా ఉన్నా డ్రగ్స్ అంశంపై బీఆర్ఎస్ దుమ్ము దులిపేందుకు కాంగ్రెస్ సభ్యులు సిద్ధమవుతున్నారు. తాజా ఘటన బీఆర్ఎస్ పార్టీని డిఫెన్సులోకి నెట్టినట్లయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>