కలం, నల్లగొండ బ్యూరో: అన్నదాతలకు ఎరువుల కోసం సీఎం రేవంత్ రెడ్డికి అందజేసిన చెక్స్‌పై వస్తున్న విమర్శలకు త్వరలోనే సమాధానమిస్తానని మిర్యాలగూడ (Miryalaguda) ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మిర్యాలగూడ పట్టణంలో రైస్ మిల్లర్స్ సహకారంతో ప్రతి పేదొడి (Poor) కడుపు నింపే లక్ష్యంగా ‘అన్నపూర్ణ అభయ హస్తం‘ పేరుతో రూ.5లకే భోజనం ఏర్పాటు చేస్తానన్నారు.
రూ.400 కోట్లతో మిర్యాలగూడ పట్టణ సుందరీకరణ పనులు చేపట్టామని, భవిష్యత్తులో తాగునీటి అవసరాల కోసం రూ.173 కోట్లు ఖర్చు చేసి ఇంటింటికి మంచినీరు అందిస్తామన్నారు. పేదలకు 2,500 ఇండ్లు ఇస్తామని, త్వరలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో ఆర్టీసీ బస్టాండ్‌కు ఇంద్ర శక్తి పెట్రోల్ బంకును ఏర్పాటు చేస్తామన్నారు. అభివృద్ధి అంటే సీసీ రోడ్లు, డ్రైనేజీలు కాదని, ప్రజల మౌలిక అవసరాలు తీర్చేదే నిజమైన అభివృద్ధి అని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.


