కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) గారి మేడారం (Medaram) పర్యటన అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎలాంటి కాన్వాయ్‌ల ఆర్భాటాలు లేకుండా జనంతో కలిసి పర్యటించారు. గురువారం తెల్లవారు ఝాము నుంచి కార్యక్షేత్రంలోకి దిగి అందరినీ ఆశ్చర్య పరిచారు. గత కొంతకాలంగా మేడారం అభివృద్ది పనులను పర్యవేక్షించిన ఆయన ఇప్పుడు మేడారం జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దగ్గరుండి పర్యవేక్షించారు. గత రాత్రి గద్దె చేరిన పెద్దమ్మలను సతీసమేతంగా దర్శనం చేసుకున్న పొంగులేటి ఉదయన్నే ఓ సేవా కార్యకర్తలా కదనరంగంలోకి దూకారు.
కలెక్టర్‌తో కలిసి బైక్‌పై పయనం
వనదేవతలు కొలువైన మేడారంలో సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లను పరిశీలించేందుకు మంత్రి పొంగులేటి సరికొత్త పంథాను ఎంచుకున్నారు. కారు దిగి బైక్ ఎక్కారు. జిల్లా కలెక్టర్ టి.ఎస్.దివాకర్‌ను తన వెనుక కూర్చోబెట్టుకుని, స్వయంగా బైక్ నడుపుతూ గల్లీ గల్లీని చుట్టేశారు. ప్రోటోకాల్ గోడలు బద్ధలు కొట్టి, సామాన్యుడిలా భక్తుల చెంతకు చేరారు. జంపన్న వాగు (Jampanna Vagu) వద్ద భక్తులకు అందుతున్న సౌకర్యాలను క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు. ఈపర్యటనలో సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కూడా పాల్గొన్నారు.
టీ ముచ్చట:
పర్యటనలో భాగంగా ఒక టీ కొట్టు వద్ద ఆగి, చాయ్ తాగుతూ అక్కడున్న భక్తులతో ముచ్చటించారు. ఛాయ్ వాలాతో చమత్కరించారు. “ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ? సౌకర్యాలు ఎలా ఉన్నాయి ?” అంటూ ఆరా తీశారు. ఏ ఒక్క భక్తుడికి అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో అధికారులకు అక్కడికక్కడే దిశానిర్దేశం చేశారు.

Read Also: యాదాద్రిలో ఇంటి దొంగలు.. బంగారు డాలర్ల మాయం.
Follow Us On: Pinterest


