కలం, నల్లగొండ బ్యూరో : తెలంగాణ (Telangana) తిరుపతిగా ప్రసిద్ది చెందిన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం (Yadadri Temple) లో ఇంటి దొంగలు ఎక్కువయ్యారు. పుణ్యక్షేత్రం మాటున అందినకాడికి దోచుకుంటున్నారు. లక్ష్మీనరసింహుడి ఆదాయాన్ని పక్కదారి పట్టించేస్తున్నారు. తరచూ ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నా.. చర్యలు మాత్రం తూతూమంత్రంగానే ఉంటున్నాయి. యాదాద్రి పుణ్యక్షేత్రంలో గతంలో లడ్డూ తయారీ పోటులో ఇటీవల చింతపండు చోరీ గురయ్యింది. తాజాగా యాదాద్రి ఆలయంలోని ప్రచార శాఖలో బంగారు, వెండి డాలర్లను అక్రమార్కులు స్వాహా చేశారు.
అక్షరాల రూ.10 లక్షల విలువైన డాలర్లు మాయం వెనుక ఆలయ అధికారుల ప్రమేయం ఉందనే ఆరోపణలు లేకపోలేదు. అయితే ప్రచార శాఖలో 20 ఏళ్లుగా స్వామివారి డాలర్లను విక్రయిస్తున్నారు. మధ్యలో కొద్ది రోజుల పాటు ఆగినప్పటికీ గత సర్కారు హయాంలో డాలర్ల విక్రయాలను తిరిగి ప్రారంభించారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ భక్తులకు విక్రయించాల్సిన బంగారు, వెండి డాలర్లను ఆలయ అధికారులు స్వాహా చేయడం పెనుదుమారం రేపుతుంది.
ప్రచార శాఖను ఒక ఏఈఓ (AEO) స్థాయి అధికారి నేతృత్వంలో నిర్వహిస్తున్నా.. అక్రమాలు వెలుగు చూశాయి. నిజానికి స్వామి వారికి వివిధ రూపాల్లో వచ్చిన బంగారం, వెండిని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని మింట్ కాంపౌండ్‌కు ఆలయ ఈవో అందజేస్తారు. ఇందులో 200 బంగారం డాలర్లు, 1000 వెండి డాలర్లు సిద్ధం చేసిన తర్వాత ఈవో పర్యవేక్షణలో ఉంటాయి. ఇటీవలి తనిఖీల్లో బంగారం, వెండి డాలర్లు కనిపించకుండా పోయాయి.


