Mobile Popup Ad
Mobile Popup Ad

ఖమ్మంలో భూ ఆక్రమణలు పెరిగిపోయాయి : మంత్రి తుమ్మల

కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 2019 నుంచి భూ ఆక్రమణలు పెరిగిపోయాయని, ఇందులో భాగంగానే వెలుగుమట్లలో పేదల ముసుగులో ఉన్న మాఫియా… పేదలను ముందు పెట్టి అధికారులను రానివ్వకుండా దౌర్జన్యాలు చేశారని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Tummala Nageswara Rao) మండిపడ్డారు. ఆదివారం రఘునాథపాలెం మండలం రైతు వేదిక వద్ద లబ్ధిదారులకు వ్యవసాయ పనిముట్లు, వ్యవసాయ సాగు యంత్రాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అభివృద్ధి పనులలో భాగంగా నిరుపేదలు ఇండ్లు కోల్పోతే వెంటనే ప్రత్యామ్నాయ ఇంటి స్థలం అందించి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని లేని పక్షంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని అధికారులకు ఆయన (Tummala Nageswara Rao) సూచనలు చేశారు.

వెలుగుమట్ల ఘటనలో విచారణ చేయించి అర్హులైన పేదలకు అక్కడే స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, మరి కొంతమంది పేదలకు వారి ఊర్లలో స్థలం ఉంటే అక్కడ ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. వెలుగుమట్ల వద్ద విద్యుత్ సరఫరా, త్రాగునీటి సరఫరా వంటి మౌళిక వసతుల కల్పన పనులు కూడా ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిందన్నారు. రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన కాలనీగా వెలుగుమట్ల కాలనీని తీర్చిదిద్దుతామని, రాబోయే డిసెంబర్ 9న సీఎం రేవంత్ చేతుల మీదుగా కాలనీ ప్రారంభిస్తామన్నారు. ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి భూదాన్ భూములు ఆక్రమణ చేశారని వాటిని స్వాధీనం చేసుకోవాలని కోర్టు, సిసిఎల్ఏ ఇచ్చిన ఆదేశాల మేరకు వెలుగుమట్లలో కూల్చివేతలు చేపట్టామన్నారు.

రఘునాథ పాలెం మండలం ఏర్పాటు, స్వామి నారాయణ పాఠశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్, ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటులో తాను కీలక పాత్ర పోషించానని మంత్రి గుర్తుచేశారు. గ్రామాలలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లు పాలన పరిధిలో పట్టు సాధించాలని, వ్యవసాయం, పారిశుద్ధ్యం, కరెంట్ వంటి అన్ని రంగాలలో ఉన్న సమస్యల పరిష్కారానికి దృష్టి సారించాలని సూచించారు. ప్రజలను చైతన్యవంతం చేస్తూ ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. రాబోయే బడ్జెట్ నుంచి వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా రైతు తనకు నచ్చిన పనిముట్టు నచ్చిన కంపెనీ నుంచి కొనుగోలు చేస్తే సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాలో జమ చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. అంతకుముందు మంత్రి ఉద్యాన శాఖ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు వ్యవసాయ సాగు యంత్రాలు, ట్రాక్టర్ లు, స్ట్రా బాలేర్, పవర్ ఆపరేటెడ్ స్ప్రేయర్, వ్యవసాయ డ్రోన్లు, రోటోవేటర్లు, బ్రష్ కట్టర్ లు సబ్సిడీపై రైతులకు పంపిణీ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>