అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు డ్రగ్స్ టెస్టింగ్.. పార్టీల పోటాపోటీ డిమాండ్

కలం, తెలంగాణ బ్యూరో: అధికార, ప్రతిపక్ష పార్టీల సవాళ్ళకు ఈసారి అసెంబ్లీ వేదిక కాబోతున్నది. బడ్జెట్ సమావేశాలు పొలిటికల్ హీట్‌తో ప్రారంభం కాబోతున్నాయి. మద్యం తాగి వాహనం నడిపేవారిని డ్రంకెన్ డ్రైవ్ పేరుతో బ్రీత్ ఎనలైజర్ల ద్వారా అక్కడికక్కడే టెస్ట్ చేయడం ఇప్పటివరకూ మనం చూశాం. అసెంబ్లీ ఆవరణలో ఇలాంటి వాతావరణమే ఉండదు. కానీ ఈసారి డ్రగ్స్ సేవించినవారిని పట్టుకునేందుకు మొబైల్ టెస్టింగ్ సెంటర్ లేదా ల్యాబ్ లాంటిది పెట్టాలన్న డిమాండ్లు వస్తున్నాయి. టెస్టింగ్‌కు మేం రెడీ అంటూ అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ సభ్యులు స్వచ్ఛందంగా సిద్ధమవుతున్నారు. ఈ సవాళ్ళు, ప్రతిసవాళ్ళు, స్టేట్‌మెంట్ల మధ్య డ్రగ్స్ టెస్టింగ్ సెంటర్ పెట్టడానికి స్పీకర్ అంగీకరిస్తారా?.. ఫస్ట్ టైమ్ హిస్టరీ సృష్టిస్తారా?.. పొలిటికల్ స్టేట్‌మెంట్లుగా పరిగణించి వదిలేస్తారా?.. ఇవీ ఇప్పుడు చర్చనీయాంశాలుగా మారాయి.

ఫస్ట్ నేనే టెస్ట్ చేయించుకుంటాను : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

ప్రజా ప్రతినిధులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని, డ్రగ్స్ లాంటి వ్యసానాలకు దూరంగా ఉండాలని కామెంట్ చేసిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి టెస్టింగ్ చేయించుకోడానికి తాను సిద్ధమని, ముందువరుసలో తానే ఉంటానంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఒక మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌజ్‌లో వీకెండ్ పార్టీ పేరుతో డ్రగ్స్ వాడడాన్ని తప్పుపట్టారు. సమాచారం తెలుసుకుని వెళ్లిన పోలీసులపై రివాల్వర్‌తో కాల్పులు జరపడాన్ని కూడా ఖండించారు. డ్రగ్స్ భూతంపై ప్రభుత్వం యుద్ధం ప్రకటించినందున ఈ కేసు దర్యాప్తును సీరియస్‌గా తీసుకోవాలని, మరోసారి డ్రగ్స్ గురించి ఆలోచించాలంటేనే భయం పుట్టేలా చర్యలు ఉండాలని అన్నారు. డ్రగ్స్ వ్యసనం గురించి ప్రజలకు మెసేజ్ ఇవ్వాల్సిన ప్రజా ప్రతినిధిగా తానే తొలుత టెస్టింగ్ చేయించుకుంటానని, ఇతరులూ సిద్ధం కావాలన్నారు.

మేమంతా టెస్టింగ్‌కు రెడీ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్

బీర్ఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డ్రగ్స్ టెస్టింగ్ చేయించుకోడానికి రెడీ అని నొక్కిచెప్పిన ఆ పార్టీ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అసెంబ్లీ ఆవరణలోనే మొబైల్ సెంటర్ లేదా ల్యాబ్‌ను పెట్టాలని డిమాండ్ చేశారు. పీసీసీ చీఫ్ హోదాలో మహేశ్‌కుమార్ గౌడ్‌ చేసిన కామెంట్‌ను దాసోజు గుర్తుచేశారు. దమ్ముంటే ఈ సెంటర్‌ను అసెంబ్లీ దగ్గరే పెట్టిస్తే ముఖ్యమంత్రి, మంత్రులు సహా కాంగ్రెస్ సభ్యులు కూడా టెస్ట్ చేయించుకోవాలన్నారు. బీఆర్ఎస్ తరఫున అందరినీ టెస్టింగ్‌కు తీసుకొస్తానన్నారు. మరోవైపు కేటీఆర్ సైతం ట్వీట్ ద్వారా “అన్ని రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులు డ్రగ్స్ పరీక్షకు హాజరు కావాలి.. మహేశ్ కుమార్ గౌడ్ ఇచ్చిన సూచనను నేను స్వాగతిస్తున్నా.. ఏ పరీక్షకైనా, ఏ సమయంలోనైనా నేను సిద్ధం.. ఇప్పటికే చాలాసార్లు చెప్పాను..” అని స్పష్టం చేశారు. ఇక సెంటర్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకరే.

అసెంబ్లీ దగ్గరే టెస్టులు చేయించుకుందాం : పీసీసీ చీఫ్

“బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు డ్రగ్స్, కొకెయిన్, గంజాయిని పెంచి పోషించింది. గతంలో కేటీఆర్ మీద అనుమానముండె.. అసెంబ్లీ సాక్షిగా పరీక్ష చేయించుకోడానికి కేటీఆర్ సిద్ధం కావాలి.. రండి.. మీరూ, మేమూ కలిసి పరీక్షలు చేయించుకుందాం.. అనుమానాలను పటాపంచలు చేద్దాం.. రేపే అసెంబ్లీ సాక్షిగా మనందరం టెస్టులు చేయించుకుందాం..” అని పీసీస చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఈ సవాలుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కేటీఆర్, దాసోజు శ్రవణ్ పాజిటివ్‌గా స్పందించడం విశేషం. అన్ని పార్టీలూ డ్రగ్స్ టెస్టులకు సిద్ధమవుతుండడంతో స్పీకర్ తీసుకునే నిర్ణయం కీలకంగా మారింది. మద్యం సేవించి సభకు వస్తున్నారంటూ గతంలో హరీశ్‌రావు ఒక మంత్రిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసి డ్రంకెన్ డ్రైవింగ్ టెస్ట్ పెట్టాలని స్పీకర్‌కు సూచించారు. ఇప్పుడు ఏకంగా డ్రగ్స్ టెస్టింగ్ డిమాండ్ రావడం విశేషం. స్పీకర్ పాజిటివ్ నిర్ణయం తీసుకుంటే ఫస్ట్ టైమ్ అసెంబ్లీలో డ్రగ్స్ టెస్టింగ్ జరిగినట్లవుతుంది.

డ్రగ్స్ టెస్టుకు నేను కూడా రెడీ : బీజేపీ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి

రాష్ట్రంలో మత్తు పదార్ధాల సమస్య తీవ్రంగా ఉన్నదని, పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిధులంతా దీన్ని తరిమేయడానికి ప్రభుత్వానికి సహకరించాలని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి అన్నారు. డ్రగ్స్ కారణంగా యువత భవిష్యత్తు ఛిద్రమవుతున్నదని, ఫార్మా కంపెనీల నుంచే డ్రగ్స్ వస్తున్నాయన్నారు. అసెంబ్లీ వేదికగా సోమవారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ డ్రగ్స్ టెస్టులు చేయాలన్నారు. ఈ టెస్ట్ చేయించుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, దీనితో పాటే బ్రీత్ ఎనలైజర్ ద్వారా డ్రంకెన్ టెస్టులూ చేయాలన్నారు. డ్రగ్స్ భూతాన్ని తరిమేయడానికి ప్రభుత్వం చేపట్టే ఏ చర్యలకైనా తమ పార్టీ సిద్ధమని, సహకరిస్తుందన్నారు. బీజేపీ ఎల్పీ సమావేశం సందర్భంగా డ్రగ్స్ గురించి పాత్రికేయులు అడగ్గా పై విధంగా బదులిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>