కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) నియోజకవర్గాల పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు రూపొందిన షెడ్యూలులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఆమె పర్యటించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వీబీ-జీ రామ్ జీ చట్టానికి వ్యతిరేకంగా ఈ ప్రోగ్రామ్ చేపట్టనున్నారు. గతంలో అమల్లో ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని నిరసనల ద్వారా డిమాండ్ చేయనున్నారు. మెదక్ నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఆమె పర్యటించే ప్రతీ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున జరిగే నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఇప్పటివరకు లబ్ధిపొందిన పేద కుటుంబాలతో ముచ్చటించనున్నారు. వారితోనే సహపంక్తి భోజనం చేయనున్నారు.
ఏఐసీసీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా రూపొందిన ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan)షెడ్యూలును పీసీసీ ఖరారు చేసింది. నియోజకవర్గాల్లో పర్యటించేటప్పుడు ఆ జిల్లా డీసీసీ అధ్యక్షులు, రాష్ట్రస్థాయి నేతలు, స్థానిక కాంగ్రెస్ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, జిల్లా ఇన్‌చార్జి మంత్రులు, జిల్లాకు చెందిన మంత్రులు, పోటీ చేసి ఓడిపోయిన ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు, కార్పొరేషన్ చైర్‌పర్సన్లు, జిల్లా పార్టీ కమిటీ ఆఫీస్ బేరర్లు, పార్టీకి చెందిన వివిధ విభాగాల బాధ్యులు, గ్రామ-మండల స్థాయి పార్టీ లీడర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు. ఈ మేరకు ఆమె పర్యటన ఖరారైన జిల్లాల, నియోజకవర్గాలకు గాంధీ భవన్ నుంచి సర్క్యులర్ జారీ అయింది. ఇప్పటివరకు రూపొందిన ఆమె పర్యటన షెడ్యూలు వివరాలు :
జనవరి 28 : మెదక్ నియోజకవర్గం (ఉదయం), మానకొండూరు నియోజకవర్గం (సాయంత్రం). కరీంనగర్‌లో రాత్రి బస.
జనవరి 29 : వేములవాడ (ఉదయం), ఎల్లారెడ్డి (మధ్యాహ్నం తర్వాత) – హైదరాబాద్‌లో రాత్రి బస.
జనవరి 30 : మేడారం జాతరకు హాజరు (ఉదయం); ఆలేరు (మధ్యాహ్నం)లో పర్యటన. హైదరాబాద్‌లో రాత్రి బస.
జనవరి 31 : నకిరేకల్ (ఉదయం); ఇబ్రహీంపట్నం (సాయంత్రం). రాత్రి హైదరాబాద్‌లో బస.
Read Also: అప్పుడు కేసీఆర్.. ఇప్పుడు రేవంత్.. ఎట్ హోంకు డుమ్మా
Follow Us On: Sharechat


