కలం, వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిలా మొయినాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్ మరోసారి వార్తల్లో నిలిచింది. 2022 అక్టోబర్ 26న ఇదే ఫామ్‌హౌస్‌లో జరిగిన ఎమ్మెల్యేల ప్రలోభాల ఉదంతం అప్పట్లో దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. సరిగ్గా మూడేళ్ల తర్వాత మళ్లీ అదే వేదికపై ఇప్పుడు డ్రగ్స్ పార్టీ కలకలం రేపడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా జరిగిన ఈ పార్టీలో పైలెట్ రోహిత్ రెడ్డితో పాటు ఏపీలోని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
తాజా దాడుల్లో రోహిత్ రెడ్డితో పాటు మరో నలుగురికి డ్రగ్ టెస్టులో పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. అధికారులు పార్టీ జరుగుతున్న సమయంలో మెరుపు దాడి చేయగా, అధికారులను అడ్డుకునే ప్రయత్నంలో అక్కడ కాల్పులు జరగడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. గతంలో రాజకీయ వ్యూహాలకు కేంద్రమైన ఈ ఫామ్‌హౌస్, ఇప్పుడు డ్రగ్స్ వినియోగానికి చిరునామాగా మారడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పక్కా సమాచారంతో ఈగల్ టీమ్ పోలీసులు ఈ ఫామ్‌హౌస్‌పై మెరుపు దాడులు నిర్వహించగా, అక్కడ విందు, చిందులతో కూడిన మత్తు పార్టీ వెలుగుచూసింది. ఈ దాడిలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్‌తో పాటు మొత్తం పది మంది వీఐపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే సోదాల కోసం లోపలికి వెళ్తున్న పోలీసులను భయపెట్టేందుకు నమిద్ మిశ్రా అనే వ్యక్తి ఏకంగా నాలుగు రౌండ్ల పాటు కాల్పులు జరపడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆ తుపాకీ పైలెట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డికి చెందినదిగా అధికారులు గుర్తించారు.
ఫామ్‌హౌస్ లోపల భారీగా డ్రగ్స్‌తో పాటు అత్యంత ఖరీదైన మద్యం బాటిళ్లు, హుక్కా పైపులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిని విచారించగా, కొందరు వారం క్రితమే సిమ్లా నుండి వచ్చామని, మరికొందరు గోవా నుండి వచ్చామని చెబుతున్నట్లు చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ వెల్లడించారు. ఈ పార్టీలో పాల్గొన్న వారందరి బ్లడ్ శాంపిల్స్‌ను సేకరించి ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు ఆయన వివరించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వివాదంతో గతంలో వార్తల్లో నిలిచిన ఇదే ఫామ్‌హౌస్, ఇప్పుడు డ్రగ్స్ పార్టీ, పోలీసులపై కాల్పుల ఘటనతో మరోసారి రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

