కలం, వెబ్ డెస్క్: గిరిజనులకు ఎంతో ప్రత్యేకమైన ఓజా కళ(Oja art) ను కాపాడేందుకు ప్రభుత్వం రుణాలు ఇచ్చేందుకు నిర్ణయించిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అన్నారు. గురువారం భట్టి ఆదిలాబాద్ జిల్లా(Adilabad District)లో పర్యటించారు. ఈ సందర్భంగా నాగోబా జాతర(Nagoba Jatara)కు హాజరై నాగోబాను దర్శించుకున్నారు. గర్భాలయంలో నాగోబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. గిరిజన సంస్కృతిని కాపాడుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి భట్టి వెల్లడించారు. ముందుగా ఆలయానికి చేరుకున్న భట్టి విక్రమార్కకు మెస్రం వంశీయులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. నాగోబా జాతర గిరిజనుల ఆచారాలు, సంప్రదాయాలు, విశ్వాసాలకు ప్రతీకగా నిలిచిన మహత్తర పండుగ అని భట్టి పేర్కొన్నారు. ఈ పురాతన గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడం బాధ్యతగా భావించి ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.
ఉట్నూర్ మండలంలోని కుమ్మరి తండా, దంతన్‌పల్లి, పులిమడుగు ప్రాంతాల్లో భట్టి విక్రమార్క పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. కుమ్మరి తండాలో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనానికి శంకుస్థాపన చేశారు. ఖానాపూర్ని యోజకవర్గంలో రూ.13 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్లకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. గిరిజనుల సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్ భూములకు విద్యుత్ కనెక్షన్ లేకున్నా, సోలార్ సాంకేతికత ద్వారా సాగునీరు అందించవచ్చన్నారు. గిరిజన రైతులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా సోలార్ పంప్‌సెట్లు, డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థలు, పంట మొక్కలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని వివరించారు. గిరిజనుల సమగ్రాభివృద్ధికి రూ.12,500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు.
2023 పాదయాత్ర సందర్భంగా ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను మరిచిపోలేదని, వాటికి బడ్జెట్‌లో ప్రాధాన్యతనిస్తూ పరిష్కార చర్యలు చేపట్టామని భట్టి వెల్లడించారు. చికమాన్, పులిమడుగు, త్రివేణి సంగమం వంటి కీలక ప్రాజెక్టులకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. గిరిజనులకు సమగ్రాభివృద్ధి, పేదలకు సొంతింటి కల సాకారం చేయడం, పిల్లలకు నాణ్యమైన అంతర్జాతీయ స్థాయి విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భట్టి స్పష్టం చేశారు.


