Mobile Popup Ad
Mobile Popup Ad

గల్ఫ్​ ఓటర్లపై నిజామాబాద్ నేతలతో కేటీఆర్ సమీక్ష

కలం, నిజామాబాద్ బ్యూరో: జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలంగాణ వాసుల ఓటు హక్కును కాపాడేందుకు పార్టీ తరఫున ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తెలిపారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నివాసంలో జరిగిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జుల సమావేశంలో పలు అంశాలపై కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.. త్వరలో రాష్ట్రంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఓటర్ల ఓట్ల జాబితా సవరణకు సంబంధించి తెలంగాణ ఎన్ఆర్ఐల నుంచి ఆందోళన వ్యక్తమవుతోందని కేటీఆర్ అన్నారు. గల్ఫ్ బాట పట్టిన తెలంగాణ బిడ్డల ఓటు హక్కు తొలగించకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తామని వెల్లడించారు. ఇందుకు సంబంధించి పార్టీ తరఫున ఒక సీనియర్ ప్రతినిధి, నాయకుల ప్రతినిధి బృందంతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీల బృందాన్ని దిల్లీకి పంపనున్నట్లు కేటీఆర్ తెలిపారు.

గల్ఫ్ ఎన్ఆర్ఐల వివరాల సేకరణ..

స్థానికంగా కూడా పార్టీ తరఫున ఎస్ఐఆర్ (SIR) కోసం నియమించిన బూత్ లెవెల్ అసిస్టెంట్ల ద్వారా గల్ఫ్‌లోని తెలంగాణ బిడ్డల ఓటు హక్కును కాపాడేందుకు సహాయ సహకారాలు అందిస్తామని కేటీఆర్ తెలిపారు. తమకు కేటాయించిన బూత్‌ల పరిధిలో గల్ఫ్ ఎన్ఆర్ఐల వివరాలు సేకరించి వారి ఓటు హక్కును ఎలక్షన్ కమిషన్ తొలగించకుండా సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. దీంతో పాటు పార్టీ తరఫున ఎస్ఐఆర్ కోసం నియమించిన బూత్ లెవెల్ ఏజెంట్లతో కూడా సమన్వయం చేసుకోవాలని సూచించారు.

నిజామాబాద్ జిల్లాలో పార్టీ బలోపేతంపై చర్చ..

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చేపట్టాల్సిన కార్యాచరణను కేటీఆర్ నేతలకు వివరించారు. పార్టీ పెట్టిన తొలినాళ్లలోనే జిల్లా పరిషత్తు గెలుచుకుని పార్టీకి ఆది నుంచి నిజామాబాద్ జిల్లా ఒక బలమైన కోటగా నిలిచిందని కేటీఆర్ గుర్తుచేశారు. నిజామాబాద్ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక అవకాశంగా తీసుకుని ముందుకు పోవాలని సూచించారు. కేసీఆర్ సూచించినట్లు సభ్యత్వ నమోదును కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కోరారు. దీంతో పాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని కూడా పకడ్బందీగా నిర్వహించి ఏ ఒక్క పౌరుడి ఓటు హక్కు తొలగించకుండా చూడాలని సూచించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నేతలంతా తమ స్థానిక నియోజకవర్గాల్లో ఉన్న స్థితిగతులపైన కేటీఆర్‌కి వివరాలు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వలన, చేస్తున్న మోసాల వలన అనేక వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని, తిరిగి కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని నేతలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>