కలం, న్యూస్ నెట్వర్క్: సాధారణంగా జులై నెల వచ్చిందంటే చాలు.. వాన చినుకుల సవ్వడులు, అలుగుపోసే చెరువులు, పొలాల్లో గొర్రు తొక్కించే రైతులు, పాటలు పాడుతూ నాట్లు వేసే మహిళలతో పల్లెలు కళకళలాడుతుంటాయి. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. వానాకాలం సీజన్ ప్రారంభమై నెల రోజులు దాటినా వరుణుడి జాడ లేదు. మబ్బులు పట్టినట్టే పట్టి మాయమైపోతున్నాయి. ఎల్‌నినో (El Nino Effect) ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా కరువు ఛాయలు అలుముకుంటుండటంతో అన్నదాతల ఆవేదన వర్ణనాతీతంగా మారిందని ‘కలం’ టీమ్ గ్రౌండ్ రియాల్టీ రిపోర్టులో వెల్లడైంది. వర్షాల రాకపోవడంతో ప్రస్తుతం దుక్కుల దగ్గరే వ్యవసాయ పనులు ఆగిపోవడంతో ‘ఈసారి బతుకు సాగుడెట్ల?’ అని రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
అడుగంటిన జలాలు.. ఎండిపోతున్న ఆశలు
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 26 జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. నిరుడు ఈపాటికి లక్ష ఎకరాల్లో వరి సాగు ప్రారంభం కాగా, ఈసారి అది 30 వేల ఎకరాలు కూడా దాటలేదు. భూగర్భ జలాలు పాతాళానికి పడిపోవడంతో పాత బోర్లు ఎండిపోయాయి. వెయ్యి అడుగులు వేసినా చుక్క నీరు పడటం లేదు. ప్రాజెక్టుల్లో సైతం నీళ్లు అడుగంటడంతో కాల్వల కింద ఆయకట్టు సాగు ఆశలు అడుగంటాయి. చేసేదేమీ లేక బోరుబావులపై ఆధారపడి వేసిన అరకొర నాట్లు, పత్తి మొలకలు సైతం ఎండ తీవ్రతకు, వేడి గాలులకు కళ్లముందే మాడిపోతున్నాయి. విత్తనాలు మొలకెత్తక ఇప్పటికే రెండు మూడు సార్లు విత్తిన రైతులు వేలాది రూపాయల పెట్టుబడి నష్టపోయారు.
ఖమ్మం జిల్లాలో పరిస్థితి ఇదీ..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గతేడాది ఇదే సమయానికి వరినాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఈసారి వర్షాలు ముఖం చాటేయడంతో చాలాచోట్ల నాట్లు మొదలు కాలేదు. ఎల్‌నినో ప్రభావం రైతుల్ని ఆందోళనలో పడేసింది. సాగు విస్తీర్ణాన్ని తగ్గించుకుంటున్నారు. కిన్నెరసాని నీరందే ప్రాంతాల్లోని రైతుల్లో కొంత ధైర్యం ఉన్నా జిల్లాలోని ఇతర మండలాల రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ప్రభుత్వం ఏడు రకాల వరి వంగడాలను మాత్రమే సాగు చేయాలనే నిబంధన విధింపు రైతులకు సవాలుగా మారింది. ఆయా రకాలతో దిగుబడి తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులకు విత్తనాలు దొరుకుతున్నా యూరియా విషయంలో మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు.
వానల భయంతో సాగు తగ్గించా : బర్ల ప్రభాకర్, బూర్గంపాడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
”బీ టెక్ చేశా. జాబ్ చేయడం ఇష్టం లేదు. వ్యవసాయం చేస్తున్నా. పోయినేడాది 13 ఎకరాల్లో వరి వేశా. ఈసారి ఎల్ నినో అంటున్నారు. పది ఎకరాలే వేస్తున్నా. వర్షాలు వస్తాయో రావో భయంగా ఉంది. లాస్ట్ ఇయర్ ఇప్పటికే నాట్లు కూడా పూర్తి చేశా. కానీ ఈసారి వేయలేదు. కిన్నెరసాని నీళ్లు వస్తాయి. కొంచెం ధైర్యం ఉన్నా, ఎల్‌నినో, వర్షాభావం భయపెడుతున్నది” అని బర్ల ప్రభాకర్ అనే రైతు అన్నారు.
వరంగల్ జిల్లాలో ఇలా..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఖరీఫ్ సీజన్ అనిశ్చితిలో పడింది. ఎల్‌నినో కారణంగా వర్షాల్లేక రైతులు సాగు విస్తీర్ణాన్ని తగ్గించుకున్నారు. 10 ఎకరాల్లో పత్తి వేసే రైతులు ఈసారి 5 ఎకరాలకే పరిమితం చేసుకుంటున్నారు. కొందరు వరి సాగును పూర్తిగా వదిలేయాలనుకుంటున్నారు. ఆల్టర్నేట్‌గా తక్కువ నీటి పంటలవైపు ఆలోచిస్తున్నారు. పత్తి, కంది, పెసర, మినుము, జొన్న, సజ్జ వంటి వాటిని పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే వర్షాభావ మండలాలను ప్రభుత్వం ప్రకటించి ప్రత్యామ్నాయ పంటలకు ప్రత్యేక మార్గదర్శకాలు ఇవ్వాలని, కౌలు రైతులకు కూడా ప్రభుత్వ సాయం అందించి పంట రుణాల రీ షెడ్యూలింగ్ చేయాలని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.
సాయం అందిస్తే గట్టెక్కుతాం : సీహెచ్ నవీన్ కుమార్, జనగామ జిల్లా
”వర్షాలు లేవు. పరిస్థితులకు తగ్గట్టు ప్రత్యామ్నాయ పంటలు వేసుకుంటున్నాం. అగ్రికల్చర్ ఆఫీసర్లు చెప్పినట్లు తక్కువ నీటితో సాగయ్యే పంటల గురించి ఆలోచిస్తున్నాం. ప్రభుత్వం విత్తనాలతో పాటు సలహాలు, అవసరమైన సాయం అందిస్తే కొంత గట్టెక్కుతాం. ప్రకృతి ఎప్పుడు సహకరిస్తుందో తెలియదు. ఏదో ఒక ఆల్టర్నేట్ చూసుకుంటున్నాం. మా ఊర్లో చాలామంది ఇట్లానే ఆలోచిస్తున్నారు” అని సీహెచ్ నవీన్ కుమార్ అనే రైతు తెలిపారు.
నల్లగొండ జిల్లా అన్నదాతల్లో అంతర్మథనం
భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయి బోర్లు ఎండిపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన నల్లగొండ రైతులు రేపటి బతుకు ఎట్లా అని అంతర్మథనంలో పడ్డారు. ముఖ్యంగా కౌలు రైతులకు అత్యంత దయనీయమైన స్థితి నెలకొంది. పంట పండినా, పండకపోయినా భూమి యజమానికి కౌలు రైతులు వేలాది రూపాయల లీజు డబ్బులు కట్టేశారు. ఇప్పుడు ఎల్ నినో ప్రభావంపై ఆందోళన చెందుతున్నారు. ఇటు పెట్టుబడి పోయి, అటు కౌలు డబ్బులు కట్టలేక ఏం చేయాలో అర్థం కావడం లేదని.. తమలాంటి వారిని ప్రభుత్వమే అదుకోవాలని కౌలు రైతులు డిమాండ్ చేస్తున్నారు.
మూడు బోర్లు వేసినా చుక్క నీరు పడలేదు : బట్టు ప్రకాష్, తిప్పర్తి
”గత వానకాలంలో ఈ పాటికి నాట్లు పూర్తయ్యేవి. ఈసారి జూన్ వెళ్ళి జూలై వచ్చినా ఆకాశంలో మబ్బుల జాడే లేదు. ఉన్న పాత బోర్లన్నీ పూర్తిగా ఎండిపోయాయి. చేతిలో పైసల్లేకపోయినా, ఎకరం పొలం అయినా పండించుకుందామని అప్పు తెచ్చి రెండు కొత్త బోర్లు వేయించాను. 400 అడుగుల లోతుకు వెళ్లినా తడి తగలలేదు. పెట్టిన పెట్టుబడి మట్టిపాలైంది. వర్షాల్లేక, బోర్లు నడవక ఈసారి పొలాన్ని అట్లే పడావు వదిలేసే పరిస్థితి వచ్చింది” అని బట్టు ప్రకాష్ అనే రైతు చెప్పారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో కరువు ఛాయలు
ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని ఆశించిన మహబూబ్‌నగర్ రైతులకు ‘ఎల్‌నినో’ రూపంలో నిరాశే ఎదురైంది. జూలై ఆరంభం నాటికి ఉమ్మడి జిల్లాలో వర్షపాతం లోటు దాదాపు -83%. కొన్ని చోట్ల ఇది -100%గా ఉంది. సాధారణంగా ఈ సమయానికే 70% విస్తీర్ణంలో విత్తనాలు పడతాయి. కానీ కేవలం 30% విస్తీర్ణంలోనే సాగు పనులు జరుగుతున్నాయి. పాలమూరు జిల్లాలో ప్రధాన పంట పత్తి. తొలకరి జల్లులు చూసి తొందరపడి విత్తనాలు వేసిన రైతులు ఇప్పుడు వర్షం లేక మొలకలు వాడిపోతుంటే బాధపడుతున్నారు. వేలాది ఎకరాల్లో వేసిన పత్తి, మొక్కజొన్న పంటలు నీరు లేక ఎండిపోతున్నాయి. పాలమూరు జిల్లాను ఒకప్పుడు ‘వలసల జిల్లా’ అని పిల్చుకునేవారు. ప్రాజెక్టుల రాకతో ఆ పరిస్థితి కొంత మారింది. కానీ, ఈ సీజన్‌లో పనులు లేకపోవడంతో కూలీలు మళ్లీ పట్టణాల బాట పడుతున్నారు.
భారీ వర్షం పడితేనే సాగు : మల్లు రాజేందర్ రెడ్డి, మాచన్పల్లి , మహబూబ్ నగర్ జిల్లా
”ఖరీఫ్ సీజన్ మొదలై నెలన్నర దాటింది. వర్షం రాకపోగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. నాకున్న 15 ఎకరాల పొలంలో ప్రస్తుతం ఐదు ఎకరాలకు సరిపోను మాత్రమే వరి వేశాను. వర్షం పడితే మిగతాది సాగు చేస్తా. వర్షం రాకపోతే బీడుగానే ఉంచక తప్పదు. నా జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదు” అని మల్లు రాజేందర్ రెడ్డి అనే రైతు వెల్లడించారు.
మోటర్లపైన ఆధారపడ్డ మెదక్ రైతులు
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఆయకట్టు రైతులు వర్షాలపైన, బోర్లపైన ఆధారపడుతున్నారు. కొన్ని ప్రాంతాలు ఘనపురం ఆనకట్ట మీద, సిద్దిపేట జిల్లాలో మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ ప్రాజెక్టులపై ఆధారపడతారు. నీటి నిల్వలు అడుగంటడంతో కాల్వల ద్వారా అందే ఆయకట్టు సాగునీరు మీద ఆశల్లేవు. దీంతో రైతులు బోర్లపైనే ఆధారపడాల్సి వస్తున్నది. కానీ ‘కరెంటు ట్రిప్పవుతున్నది. లో-వోల్టేజి వస్తున్నది. ట్రాన్స్ పార్మర్లు కాలిపోతున్నయి. సొంత పైసలతో బండి కిరాయి తీసుకొని రైతులు తీసుకువెళ్తున్నారు. నాణ్యమైన కరెంటు సరఫరా సక్రమంగా చేయాలి’ అని పలువురు రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
మోటర్ల కాలుతున్నాయి : శివయ్య , బుస్వా రెడ్డి పల్లి
”వర్షాలు లేకపొవడంతో బోర్లు మీదనే అధారపడి సాగు మొదలు పెట్టినాము. కానీ కరెంటు ట్రిప్పవుతున్నది. లో-వోల్టేజి వస్తున్నది. ట్రాన్స్ పార్మర్లు కాలిపోతున్నయి. సొంత పైసలతో బండి కిరాయి తీసుకొని రైతులు తీసుకువెళ్తున్నారు. నాణ్యమైన కరెంటు సరఫరా సక్రమంగా చేయాలి” అని శివయ్య అనే రైతు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నిజామాబాద్ జిల్లాలో సగం కూడా సాగు కాలే..
తెలంగాణలోనే అన్నపూర్ణగా పేరు గాంచిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలు సకాలంలో లేక నాట్లు ఆలస్యమయ్యాయి. వర్షాభావ పరిస్థితులతో ఈసారి నాట్లు మందకొడిగా సాగుతున్నాయి. బాన్సువాడ డివిజన్ ను మినహాయిస్తే నిజామాబాబ్, కామారెడ్డి జిల్లాల్లోని అన్ని మండలాల్లో నాట్లు లేటు అయ్యాయి. ప్రాజెక్టుల్లో నీటి సామర్థ్యం పెరగలేదు. శ్రీరామ్ సాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులకు భారీగా వరద లేక వెలవెల బోతున్నాయి. భూగర్భ జలాలు సైతం పడిపోయాయి. దీంతో బోర్లు వట్టిపోతున్నాయి. ఈసారి బోరు బావుల కింద కూడా నార్లు వేసేందుకు రైతులు ధైర్యం చేయడం లేదు. జూలై చివరి దాకా తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండగా.. మరోవైపు పంటలు పండుతాయనే నమ్మకం రైతుల్లో కనిపించడం లేదు. గతసారి కంటే ఈసారి పంట విస్తీర్ణం తగ్గించుకుంటున్నారు.
వరి తప్ప ఏ పంట పండదు : బెస్త ప్రభు, సోమార్ పేట్, కామారెడ్డి జిల్లా
” నాకున్న రెండెకరాల్లో ఏటా వరి పండిస్తా. ఈసారి వానలు లేక వరి పండుతుందనే నమ్మకం లేదు. ధైర్యం చేసి పంట వేయాలని చూస్తుండగా వర్షాలు పడుతుండగా.. నాట్లు వేస్తున్నాం. కానీ అవి మొలకెత్తి బతుకుతాయో లేదోనని భయంగా ఉంది. వరి తప్ప వేరే పంటలు పండవు”అని బెస్త ప్రభు అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
కరీంనగర్ జిల్లాలో పరిస్థితి ఇదీ..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ ఏడాది వర్షాభావం అన్నదాతలను తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. ఎల్‌నినో కారణంగా విత్తనాలు వేసేందుకు రైతులు వెనుకంజ వేస్తున్నారు. వ్యవసాయ శాఖ అంచనాల మేరకు ఇప్పటివరకు నమోదైన సాగు శాతం చాలా తక్కువగా ఉంది. కరీంనగర్ జిల్లాలో 5.25, పెద్దపల్లిలో 1.03, జగిత్యాలలో అత్యల్పంగా 0.57 శాతం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6.52 శాతంగా మాత్రమే పంటలు సాగు చేశారు. ప్రస్తుత పరిస్థితిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. పత్తి, చెరుకు, సోయాబిన్, జొన్నలు, సజ్జలు, కందులు, పెసర్లు, వేరుశనగ వంటి పంటల వేసే ఆలోచన చేస్తున్నారు. వర్షాలు లేక పంటలు పండకపోయినా కౌలు డబ్బులు యజమానులు చెల్లించాల్సి వస్తుందని కౌలు రైతులు వాపోతున్నారు. బోర్లు, బావుల కిందనే సాగు చేస్తుండటంతో ఖరీఫ్ లో ట్రాన్స్ ఫర్లపై ఒత్తిడి పెరిగి కాలిపోతున్నాయని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దుక్కి దున్ని.. వాన కోసం చూస్తున్నా: సురేందర్, రేకొండ, కరీంనగర్ జిల్లా
” వానలు లేవు.. భూమి దున్నుకుని, ఆకాశం వైపు చూసుడే అయితుంది. అప్పులు చేసి పెట్టుబడులు పెడుతున్నాం. ఎరువులు, విత్తనాల రేట్లు పెరిగాయి. ఖర్చులు తడిసి మోపెడయితున్నయి. ఈనెలలో వర్షాలు పడకుంటే బీడు భూములుగానే మారుతాయి. వర్షాలు లేక ,బోర్లు మీదనే ఆధారపడి సాగు మొదలు పెట్టినా. కానీ కరెంటు ట్రిప్పులు, వోల్టేజి సమస్యలతో ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతున్నాయి” అని సురేందర్ అనే రైతు వాపోయారు.

